ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్
గూగుల్ వాయిస్ కాల్‌లకు "అనుమానాస్పద స్పామ్ కాలర్" హెచ్చరికను జోడిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇది అనవసరమైన, అప్రధానమైన కాల్స్ ను ఫిల్టర్ చేస్తుంది. అయితే ఇన్‌కమింగ్ కాల్ స్పామ్ అని వినియోగదారులు ధృవీకరించాలి. గూగుల్ కాలింగ్ ఎకోసిస్టమ్‌లో ప్రతి నెలా బిలియన్ల కొద్దీ స్పామ్ కాల్‌లను గుర్తించడానికి అధునాతన కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని కంపెనీ వెల్లడించింది. గూగుల్ వాయిస్ గురించి చెప్పాలంటే, కాల్స్, వాయిస్ మెయిల్‌ల కోసం కాంటాక్ట్ నంబర్స్ ను అందిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లలో పని చేస్తుంది. అయితే,గూగుల్ వాయిస్ USలోని వ్యక్తిగత గూగుల్ ఖాతాలకు, ఎంపిక చేసిన మార్కెట్‌లలో గూగుల్ Workspace ఖాతాలకు పరిమితం చేయబడింది.
ఈ సౌకర్యం కోసం వాయిస్ స్పామ్ సెట్టింగ్‌లను ఆన్ చేయాలి
ఇన్‌కమింగ్ కాల్ స్పామ్ అని వినియోగదారులు నిర్ధారిస్తే, గూగుల్ వాయిస్ నంబర్‌కి "అనుమానిత స్పామ్ కాలర్" లేబుల్‌ని ఇస్తుంది. అదే నంబర్ నుండి భవిష్యత్తులో వచ్చే కాల్స్ వాయిస్ మెయిల్‌కి మళ్లించబడతాయి. కాల్ ఎంట్రీలు స్పామ్ ఫోల్డర్‌లో రికార్డ్ అవుతాయి. కాల్ హిస్టరీలో స్పామ్ కాల్స్ కూడా ఉంటాయి. అనుమానిత స్పామ్ లేబులింగ్ ఎంపికను యాక్సెస్ చేయడానికి, మీరు వాయిస్ స్పామ్ సెట్టింగ్‌లను (Settings > Security > Filter spam)ఆన్ చేయాలి. స్పామ్ ఫిల్టరింగ్ ఎంపికను ప్రారంభించిన తర్వాత, స్పామ్‌గా పేర్కొన్న అన్ని కాల్స్ వాయిస్‌మెయిల్‌కి వెళ్తాయి. స్పామ్ హెచ్చరికల ఫీచర్ గూగుల్ వాయిస్ కస్టమర్‌లందరికీ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకారం, రోల్ అవుట్ పూర్తి కావడానికి 15 రోజులు పడుతుంది.