Sun: సూర్యుడిలో వెండి ఎక్కువే..! దశాబ్దాల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ఖగోళ శాస్త్రవేత్తలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సూర్యుడి రహస్యానికి తాజాగా సమాధానం దొరికింది. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం సూర్యుడిలో ఉండాల్సిన దానికంటే వెండి (సిల్వర్) చాలా తక్కువగా ఉందని భావించారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం వెండి నిజంగా మాయం కాలేదని, కాంతి ప్రవర్తన కారణంగా అది గుర్తించలేకపోయామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ 'ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్' (Astronomy & Astrophysics)లో ప్రచురితమయ్యాయి.
వివరాలు
సూర్యుడిలో వెండి ఎందుకు ముఖ్యమంటే?
సూర్యుడి మొత్తం ద్రవ్యరాశిలో దాదాపు 98.5 శాతం హైడ్రోజన్, హీలియం వాయువులే ఉంటాయి.
మిగిలిన చిన్న మొత్తంలో ఉండే వెండి వంటి భారమైన మూలకాలను శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంటారు.
ఎందుకంటే ఈ మూలకాలు నక్షత్రాలు, గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి? విశ్వంలో ఎలా పరిణామం చెందాయి? అనే విషయాలను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వెండి వంటి మూలకాలు శక్తివంతమైన సూపర్‌నోవా పేలుళ్ల సమయంలో ఏర్పడతాయి.
వివరాలు
ఉల్కలతో పోల్చితే ఎందుకు తేడా?
సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడిన పదార్థంతోనే సీఐ కాన్‌డ్రైట్ (CI Chondrite) ఉల్కలు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అందువల్ల సూర్యుడిలో ఉండే వెండి పరిమాణం, ఈ ఉల్కల్లో కనిపించే వెండి స్థాయికి దాదాపు సమానంగా ఉండాలని అంచనా వేశారు.
అయితే సూర్యుడి నుంచి వచ్చే కాంతిని విశ్లేషించిన ప్రతిసారీ వెండి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు సూచించడంతో ఈ విషయం శాస్త్రవేత్తలకు పెద్ద మిస్టరీగా మారింది.
వివరాలు
సూపర్ కంప్యూటర్‌తో పరిశోధన
ఈ రహస్యాన్ని ఛేదించేందుకు అధ్యయన ప్రధాన రచయిత సెమా కాలిస్కన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం స్వీడన్‌లోని లింకోపింగ్ నగరంలో ఉన్న టెట్రాలిత్ సూపర్ కంప్యూటర్ సహాయంతో వెండి అణువుల ప్రవర్తనపై అత్యంత వివరమైన కంప్యూటర్ నమూనాలను రూపొందించింది.
మునుపటి పరిశోధనలకు భిన్నంగా, ఈ అధ్యయనంలో వెండి అణువులు కాంతిని గ్రహించే సమయంలో జరిగే నాన్-ఈక్విలిబ్రియం ఎఫెక్ట్స్ (Non-equilibrium Effects) అనే సంక్లిష్ట భౌతిక ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
వివరాలు
55 శాతం ఎక్కువ వెండి ఉన్నట్లు గుర్తింపు
ఈ కొత్త నమూనా ద్వారా సూర్యుడిలో వెండి తక్కువగా కనిపించడానికి కారణం భౌతిక శాస్త్ర ప్రభావాలేనని పరిశోధకులు గుర్తించారు.
తాజా అంచనాల ప్రకారం, ఇప్పటి వరకు భావించిన దానికంటే సూర్యుడిలో సుమారు 55 శాతం ఎక్కువ వెండి ఉన్నట్లు ఈ పరిశోధన వెల్లడించింది.
వెండి పరిమాణం సీఐ కాన్‌డ్రైట్ ఉల్కల్లో ఉన్న స్థాయితో పూర్తిగా సరిపోలకపోయినా, చాలా దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
సూర్యుడిలో వెండి నిజంగానే లేదనే అనుమానాలకు తెరపడినట్లయింది.
వెండి సూర్యుడి నుంచి అదృశ్యం కాలేదు. కాంతి ప్రవర్తన, భౌతిక శాస్త్ర ప్రభావాల వల్ల అది తక్కువగా కనిపించిందంతే.
తాజా అధ్యయనం సూర్యుడి నిర్మాణంతో పాటు విశ్వంలో మూలకాల పరిణామాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.