Ahuti Mk II: గంటకు 498 కి.మీ. వేగం.. 'ఆహుతి ఎంకే-2' డ్రోన్ సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
గంటకు 498 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మల్టీరోటర్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను అభివృద్ధి చేసి హైదరాబాద్‌కు చెందిన రక్షణ సాంకేతిక స్టార్టప్ అపోలియన్ డైనమిక్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంక్యుబేట్ అవుతున్న ఈ సంస్థ రూపొందించిన 'ఆహుతి ఎంకే-2' ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 498 కి.మీ. వేగం.. దక్షిణాసియాలోనే తొలిసారి 'ఆహుతి ఎంకే-2' గంటకు 498 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. ఒక మల్టీరోటర్ ఈ స్థాయిలో వేగాన్ని సాధించడం దక్షిణాసియాలో ఇదే తొలిసారి. ఆధునిక యుద్ధాల్లో తక్కువ ఖర్చుతో వినియోగించే షాహెద్ తరహా డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లను గాల్లోనే వేగంగా అడ్డుకునే ఉద్దేశంతో ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను రూపొందించారు.
వివరాలు
ఏడాదిలోనే 66 శాతం వేగం పెంపు
అపోలియన్ డైనమిక్స్ తొలుత అభివృద్ధి చేసిన 'ఆహుతి' డ్రోన్ 2025లో దాదాపు గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది.
ఆ తర్వాత కేవలం ఏడాది వ్యవధిలోనే దాని వేగాన్ని 66 శాతం పెంచి 'ఆహుతి ఎంకే-2'ను అభివృద్ధి చేశారు. ఈ వేగవంతమైన అభివృద్ధి సంస్థ సాంకేతిక సామర్థ్యాన్ని చాటుతోంది.
విమాన పరీక్షల్లో అమన్ విరాణి కీలక పాత్ర
అపోలియన్ డైనమిక్స్‌ను జయంత్ ఖత్రి, సౌర్య చౌదరి స్థాపించారు. 'ఆహుతి ఎంకే-2' అభివృద్ధిలో అమన్ విరాణి (షాడీ), మానస్ విచారే, ఇషాన్ సూరి కీలకంగా పనిచేశారు.
డ్రోన్ పైలట్‌గా గుర్తింపు పొందిన అమన్ విరాణి.. ఈ డ్రోన్‌కు సంబంధించిన విమాన పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు.
వివరాలు
భారత సాయుధ దళాల అవసరాలే లక్ష్యంగా..
అపోలియన్ డైనమిక్స్ 2025లో ఏర్పాటైంది. ప్రస్తుతం బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంక్యుబేట్ అవుతోంది.
భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారించింది.
ఇప్పటికే తాను రూపొందించిన కొన్ని వ్యవస్థలను భారత సైన్యానికి అందించింది.