Loading...
Indigenous AI Models : ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పనిచేసే ఏఐ.. మూడు స్వదేశీ ఏఐ మోడళ్లు ఆవిష్కరించిన భారత్
మూడు స్వదేశీ ఏఐ మోడళ్లు ఆవిష్కరించిన భారత్

Indigenous AI Models : ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పనిచేసే ఏఐ.. మూడు స్వదేశీ ఏఐ మోడళ్లు ఆవిష్కరించిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కృత్రిమ మేధ (ఏఐ)లో దేశీయ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో మూడు స్వదేశీ ఫౌండేషన్ ఏఐ మోడళ్లను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా-ఏఐ మిషన్ ఈ మోడళ్లను అభివృద్ధి చేయించింది. బెంగళూరుకు చెందిన సోకెట్ ఏఐ ల్యాబ్స్ రూపొందించిన 'ఏకా-1', జెన్‌టెక్యూ అభివృద్ధి చేసిన 'ధీర్-2బీ', 'ధీర్-5బీ' మోడళ్లను ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ విడుదల చేశారు. ఈ మోడళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మొబైల్ ఫోన్లలో పనిచేయగలవు. డేటా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ, రక్షణ, పారిశ్రామిక, విద్యా రంగాల్లో వీటిని ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

వివరాలు 

ఈ విభాగాల్లో ఈ మోడళ్లు సహాయపడతాయి 

గణితం,కోడింగ్,తార్కిక విశ్లేషణ,శాస్త్రీయ పరిశోధన,సైబర్ భద్రత వంటి విభాగాల్లో ఈ మోడళ్లు సహాయపడతాయని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు.

ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో, అత్యంత సున్నితమైన సమాచారంతో పనిచేసే సంస్థలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.

సాధారణంగా ఏఐ సేవలను వినియోగించుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అయితే ఈ కొత్త మోడళ్లను నేరుగా మొబైల్ ఫోన్లలోనే అమలు చేయవచ్చు.

దీనివల్ల వినియోగదారులు తమ సమాచారాన్ని ఆన్‌లైన్ సర్వర్లకు పంపాల్సిన అవసరం ఉండదు.

డేటా భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వ విభాగాలు, రక్షణ సంస్థలు, పరిశ్రమలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రత్యేక అవసరాల కోసం సురక్షితమైన, ఇంటర్నెట్ అందుబాటులో లేని వాతావరణాల్లోనూ వీటిని అమలు చేయవచ్చని తెలిపారు.

వివరాలు 

ఏకా-1లో 22 భారతీయ భాషలు

సోకెట్ ఏఐ ల్యాబ్స్ రూపొందించిన 'ఏకా-1' మోడల్‌ను గణితం, కోడింగ్, తార్కిక విశ్లేషణ వంటి పనుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.

ఈ మోడల్ 26.3 బిలియన్ పారామీటర్లతో రూపొందింది. దీనికి 7.5 ట్రిలియన్ టోకెన్ల సమాచారంతో శిక్షణ ఇచ్చినట్లు సోకెట్ ఏఐ సీఈఓ అభిషేక్ ఉప్పర్వాల్ తెలిపారు.

ఇంగ్లిష్‌తో పాటు రాజ్యాంగం గుర్తించిన 22 భారతీయ భాషల్లో ఏకా-1 పనిచేస్తుందని ఆయన వివరించారు.

100కు పైగా భారతీయ, అంతర్జాతీయ భాషలతో పాటు ప్రోగ్రామింగ్ భాషలకు కూడా ఈ మోడల్ మద్దతు ఇస్తుందని సంస్థ వెల్లడించింది.

బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, సైబర్ భద్రత వంటి రంగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏకా-1ను రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏకా-1లో 22 భారతీయ భాషలు

పలు దశల్లో జరిగే పనులను నిర్వహించడంతో పాటు కోడ్‌ను అమలు చేసే సామర్థ్యం దీనికి ఉంది.

ఆన్-ప్రిమైసెస్, ప్రైవేట్ క్లౌడ్, ఎయిర్-గ్యాప్డ్ వాతావరణాల్లోనూ ఏకా-1ను ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్-గ్యాప్డ్ వాతావరణం అంటే ఇంటర్నెట్ లేదా ఇతర బాహ్య నెట్‌వర్క్‌లతో సంబంధం లేకుండా పనిచేసే కంప్యూటర్ వ్యవస్థ.

సున్నితమైన సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన సంస్థలకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

పది భారతీయ భాషల్లో ధీర్ మోడళ్లు

జెన్‌టెక్యూ అభివృద్ధి చేసిన 'ధీర్-2బీ', 'ధీర్-5బీ' మోడళ్లు కూడా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

గూగుల్ క్లౌడ్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (టీపీయూలు) ఉపయోగించి వీటికి మొదటి నుంచి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

ఈ రెండు మోడళ్లు మిశ్రమ నిపుణుల నిర్మాణంతో రూపొందించిన ఫౌండేషన్ మోడళ్లు.

ఇంగ్లిష్‌తో పాటు పది భారతీయ భాషల్లో సేవలు అందిస్తాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే పరీక్షించిన మొబైల్ హార్డ్‌వేర్‌పై నేరుగా పనిచేయగలవు.

వివరాలు 

పది భారతీయ భాషల్లో ధీర్ మోడళ్లు

రక్షణ, ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా రంగాల్లో డేటా భద్రత, ఆటోమేషన్ అవసరాలకు ఈ మోడళ్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

తక్కువ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లోనూ ఇవి మెరుగ్గా పనిచేస్తాయని జెన్‌టెక్యూ సీఈఓ శశికుమార్ వెల్లడించారు.

వినియోగదారుల డేటా వారి మొబైల్ ఫోన్లలోనే భద్రంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ మోడళ్లకు సంబంధించిన సాంకేతిక డాక్యుమెంటేషన్, మూల్యాంకన సాధనాలను ఏఐకోష్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.

అంతేకాకుండా అపాచీ 2.0 లైసెన్స్ కింద మోడల్ వెయిట్స్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT