
Humanoid robot: ఇటలీ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలి ఎగిరే హ్యూమనాయిడ్ రోబో!
ఈ వార్తాకథనం ఏంటి
నవీన టెక్నాలజీని వినియోగించుకొని శాస్త్రవేత్తలు కొత్తకొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోని తొలి ఎగిరే హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసి సాంకేతిక రంగాన్ని సంచలనం సృష్టించారు. 'RonCub MK3' అనే పేరుతో ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించిన ఈ రోబో మనిషి ఆకృతిలో ఉండడం విశేషం. దీనికి సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. ఈ రోబోను మూడు అడుగుల ఎత్తుతో, 22 కేజీల బరువుతో తయారు చేశారు. దీనికి జెట్ థ్రస్టర్లను అమర్చడంతో నేలపై నుంచి సుమారు 20 అంగుళాల మేరకు ఎగిరే సామర్థ్యం కలిగింది.
Deails
ముఖాకృతిపై భిన్నంగా స్పందించిన నెటిజన్లు
ప్రత్యేకత ఏంటంటే.. దీని ముఖాన్ని బేబీ ఫేస్‌గా రూపొందించడం. దీంతో ఇది ఒక చిన్నారి వంటి ఆకృతిలో కనిపిస్తోంది. అయితే ఈ ముఖాకృతిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ ఫేస్ డిజైన్ కాస్త వింతగా ఉందంటూ ట్రోల్స్‌కు తెరలేపారు. తలపట్టిన టెక్నాలజీని పక్కన పెట్టి రూపకల్పనపై చర్చ కొనసాగిస్తున్నారు. ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల ప్రకారం.. ఇది ప్రదర్శన కోసంగా రూపొందించిన మోడల్ కాదని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేశామని తెలిపారు. రోబోకు ఉన్న ఎగిరే సామర్థ్యం కారణంగా మానవులు చేరలేని క్లిష్టమైన ప్రాంతాల్లోనూ ఇది చొచ్చుకుపోతుందని చెప్పారు.
Details
శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తిస్తుంది
శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, అలాగే మానవ సహాయ చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగించడంలోనూ ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో ఈ రోబో మంచి ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుత రోబో ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో ఇది విపత్తుల సమయంలో అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే పరిష్కారంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.