Meta: హ్యూమనాయిడ్ రోబోట్స్ వైపు మెటా అడుగు.. AI రంగంలో కొత్త దిశ!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్స్ ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హ్యూమనాయిడ్ రోబోటిక్స్ స్టార్ట్‌అప్ Assured Robot Intelligence (ARI) ను మెటా సొంతం చేసుకుంది. ఈ డీల్‌తో మెటా "ఎంబాడీడ్ AI" అంటే ఫిజికల్ ప్రపంచంతో పరస్పర చర్యల ద్వారా నేర్చుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెంచుతోంది. ARI రూపొందిస్తున్న ఫౌండేషన్ మోడల్స్ ద్వారా రోబోట్స్ ముందుగా ప్రోగ్రామ్ చేసిన పనులు కాకుండా పరిసరాల్ని అర్థం చేసుకుని నేర్చుకునేలా తయారు అవుతున్నాయి.
వివరాలు
అనూహ్య మార్పులను కూడా అర్థం చేసుకునే సామర్థ్యం
ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఇంటి పనులు వంటి రోజువారీ పనులు చేయగల రోబోట్స్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది కేవలం యంత్రాల కదలికలకే పరిమితం కాదు.. మనుషుల ఉద్దేశాలు, పరిస్థితులు, అనూహ్య మార్పులను కూడా అర్థం చేసుకునే సామర్థ్యం అవసరం అవుతుంది. ARI సిస్టమ్స్ రోబోట్స్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం, ఫలితాలను ముందుగానే అంచనా వేయడం, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో కీలకంగా పనిచేస్తున్నాయి.
వివరాలు
ప్రాధాన్య సంతరించుకున్న మెటా నిర్ణయం
ఈ ఒప్పందంతో ARI వ్యవస్థాపకులు Xiaolong Wang, Lerrel Pinto మెటా AI విభాగం సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో చేరనున్నారు. ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే రోబోట్స్‌పై మెటా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, హార్డ్‌వేర్-సాఫ్ట్‌వేర్ కలిపిన కొత్త వ్యవస్థలపై పరిశోధనలు జరుగుతున్నాయి. టెక్ రంగంలో రోబోటిక్స్ పోటీ పెరుగుతున్న సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తులో AI మరింత శక్తివంతం కావాలంటే అది కేవలం డేటాతో కాకుండా, నిజ జీవిత అనుభవాలతో నేర్చుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.