Page Loader
ISRO: షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం
షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం

ISRO: షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తనతో తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా తన నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం విశేషాలు ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థగా అభివృద్ధి చేశారు. దీని బరువు 2,250 కిలోగ్రాములు. ఇది కొత్తతరానికి చెందిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహం. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్‌కు ఇదే తొలి ప్రయోగం కావడంతో, ఆయన స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్‌ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం కీలకంగా ఉపయోగపడనుంది.

వివరాలు 

100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది: ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ 

వ్యవసాయ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడంలో, విమానాల నడిపింపు, మొబైల్‌ పరికరాల్లో లోకేషన్‌ ఆధారిత సేవలను అందించడంలో ఈ ఉపగ్రహం సహాయపడుతుంది. ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు. నావిగేషన్‌ శాటిలైట్‌ తన నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా స్థిరపడిందని వివరించారు. ఈ వందో ప్రయోగం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వివరాలు 

 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి.. 

"ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం దాదాపు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. విక్రమ్‌ సారాభాయ్‌ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 తరాల లాంచ్ వెహికిల్స్‌ అభివృద్ధి చేశాం. 1979లో అబ్దుల్‌ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగింది. ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి 100 ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం. ఈ 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. 3 చంద్రయాన్‌ మిషన్లు, మార్స్ ఆర్బిటర్, ఆదిత్య మిషన్, ఎస్‌ఆర్‌ఈ మిషన్లు చేపట్టాం," అని నారాయణన్‌ తెలిపారు.