విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటార్; ఫోటోలు షేర్ చేసి డిలీట్ చేసిన ఇస్రో
చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఫోటోలను చంద్రయాన్-2 ఆర్బిటార్ తీసిందని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ఇస్రో పంచుకుంది. చంద్రయాన్-2 ఆర్బిటార్ కు చెందిన Orbiter High-Resolution Camera (OHRC) సాయంతో విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసిందని ఇస్రో పేర్కొంది. అయితే ఈ ఫోటోలు పంచుకున్న కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసేసింది. దానికి కారణమేంటనేది ఇస్రో వెల్లడి చేయలేదు. 2019లో చంద్రుడి మీదకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. కానీ చంద్రుడి మీద సురక్షితంగా దిగే సమయంలో సాఫ్ట్ వేర్ సమస్య ఏర్పడటంతో చంద్రయాన్-2 క్రాష్ అయ్యింది. కాకపోతే చంద్రయాన్-2 ఆర్బిటార్ మాత్రం చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది.
చంద్రయాన్-2 లోపాలను సరిదిద్దుకున్న ఇస్రో
చంద్రయాన్-2 లో ఉన్న లోపాలను సరిదిద్దుకుని, చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రుడి మీద ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04గంటలకు విక్రమ్ ల్యాండర్ ను సురక్షితంగా దింపగలిగింది. దీంతో, చంద్రుడి దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. చంద్రుడి మీద దిగిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి మీద పరిశోధనలు చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేసింది. ఆగస్టు 23 నుండి 14రోజుల పాటు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి మీద పరిశోధనలు చేస్తాయి. ఆ తర్వాత అవి పనిచేయకపోవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.