చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే
చంద్రుడి మీదకు ఇస్రో పంపించిన చంద్రయాన్-3, తన పనిని సాఫీగా కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్ళింది. చంద్రుడి మీదకు చేరువయ్యేందుకు అన్ని కక్ష్య కుదింపు చర్యలు పూర్తయిపోయాయి. చంద్రయాన్-3 మిషన్ లో ఈరోజు ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్, రోవర్ వేరుపడతాయని ఇస్రో వెల్లడి చేసింది. జాబిల్లికి అత్యంత సమీపంలో ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్, రోవర్ వేరుపడి నెమ్మదిగా చండ్రుడి మీద దిగుతాయి. అనుకున్నట్లుగా అంతా జరిగితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడి మీద ల్యాండర్ దిగుతుంది. ఆ క్షణం కోసం ప్రతీ భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
దక్షిణ ధృవం మీద ల్యాండింగ్
చంద్రయాన్-3 ప్రయాణం జులై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ శ్రీహరికోట నుండి ప్రారంభమైంది. ఆగస్టు 5వ తేదీన భూకక్ష్యలో నుండి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కక్ష్య కుదింపు చర్యల ద్వారా చంద్రుడికి మరింత దగ్గరవుతూ ఉంది. ఇప్పటి వరకు 5కక్ష్య కుదింపు చర్యలను చేపట్టారు. చంద్రయాన్-3 ల్యాండర్, చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగనుంది. దక్షిణ ధృవంలో ఎల్లప్పుడూ చీకటిగా ఉంటుందట. అలాగే పెద్ద బిలాలు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. దక్షిణ ధృవం మీద ల్యాండర్ కనుక్కునే విషయాల ద్వారా సౌరకుటుంబం తొలినాళ్ళ గురించి కనుక్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.