
ISRO: 18న ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జనవరిలో తన 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో, ఇప్పుడు తదుపరి మిషన్‌కు సన్నద్ధమవుతోంది.
ఈ నెల 18వ తేదీ ఆదివారం రోజు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61 రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఇది ఇస్రో చేపట్టనున్న 101వ రాకెట్ ప్రయోగంగా నిలవనుంది. ఈ రాకెట్ ద్వారా భూమిని పరిశీలించే రిశాట్-18 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో మిషన్ సాగనుంది.
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభం కానుంది.
అంచనా ప్రకారం ఈ కౌంట్‌డౌన్ నిరంతరాయంగా 22 గంటల పాటు కొనసాగి, ఆదివారం తెల్లవారుజామున 5:59 గంటలకు రాకెట్ నింగిలోకి ప్రయాణించనుంది.
వివరాలు
ఇస్రో ఇతర దేశాలతో పోటీ పడే ఉద్దేశ్యంతో రాకెట్ ప్రయోగాలు చేయదు
ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ ఎస్. నారాయణన్ గురువారం షార్‌కి చేరుకున్నారు.
అంతకు ముందు చెన్నైలో ఆయన మాట్లాడుతూ.. ఇస్రో చేసే ప్రతి మిషన్ దేశ భద్రతను మెరుగుపరచడం, ప్రజల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, ఇస్రో ఇతర దేశాలతో పోటీ పడే ఉద్దేశ్యంతో రాకెట్ ప్రయోగాలు చేయదని స్పష్టం చేశారు.