Meta: మెటా స్మార్ట్ గ్లాసెస్‌లో కీలక అప్‌డేట్.. ప్రైవసీ LEDతో చెలగాటం ఆడితే కెమెరా బంద్!
ఈ వార్తాకథనం ఏంటి
మెటా తన స్మార్ట్ గ్లాసెస్‌కు కొత్త భద్రతా అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇకపై గ్లాసెస్‌లో ఉన్న ప్రైవసీ LED లైట్‌ను ఎవరైనా ధ్వంసం చేసినా,మార్పులు చేసినా లేదా దానితో చెలగాటం ఆడినట్లు గుర్తిస్తే కెమెరా ఆటోమేటిక్‌గా పనిచేయకుండా నిలిపివేస్తుంది. వినియోగదారుల గోప్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు కొంతమంది మాడర్లు (Modders)ప్రైవసీ LED లైట్‌ను డ్రిల్‌తో తొలగించడం లేదా దాని పనితీరును నిలిపివేయడం వంటి మార్పులు చేస్తూ వచ్చారు. గతంలో LED లైట్‌ను టేప్ లేదా ఇతర వస్తువులతో కప్పివేస్తే కెమెరా పనిచేయకుండా మెటా చర్యలు తీసుకున్నప్పటికీ, కొందరు వాటిని దాటిచెప్పే మార్గాలను కనుగొన్నారు. దీంతో మరింత కఠినమైన భద్రతా వ్యవస్థను కంపెనీ అమలు చేసింది.
వివరాలు
ఆన్‌లైన్ విమర్శల మధ్య అప్‌డేట్
కొద్ది వారాల క్రితం మెటా వేర్‌బుల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ హిమెల్, స్మార్ట్ గ్లాసెస్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని కంపెనీ గుర్తించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా Ray-Ban బ్రాండింగ్ లేకుండా తక్కువ ధరలో మెటా గ్లాసెస్ విడుదలైన తర్వాత ఇటువంటి ఘటనలు పెరిగినట్లు సమాచారం. అదే సమయంలో భవిష్యత్తులో ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ముఖ గుర్తింపు (Facial Recognition) సాంకేతికతను చేర్చే అవకాశాలపై వచ్చిన వార్తలు, అలాగే కొందరు వ్యక్తులు ఈ గ్లాసెస్‌ను ఉపయోగించి యువతులను వేధించిన ఘటనలు కూడా ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే కొత్త అప్‌డేట్‌ను మెటా విడుదల చేసింది.
వివరాలు
స్మార్ట్ గ్లాసెస్‌పై నిషేధాల దిశగా చర్యలు
ప్రైవసీపై ఆందోళనల కారణంగా కొన్ని ప్రజా ప్రదేశాలు స్మార్ట్ గ్లాసెస్ వినియోగంపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని అన్ని కోర్టు గదుల్లో ఈ నెలాఖరు నుంచి కెమెరా గ్లాసెస్‌ను నిషేధించనున్నట్లు Syracuse.com వెల్లడించింది. ఇప్పటికే ఫిలడెల్ఫియా కోర్టులు, కొన్ని క్రూయిజ్ సంస్థలు కూడా తమ సాధారణ ప్రదేశాల్లో ఈ పరికరాల వినియోగాన్ని పరిమితం చేశాయి.
వివరాలు
LEDను నిర్వీర్యం చేసే సేవలపై మెటా కన్ను
స్మార్ట్ గ్లాసెస్‌లోని ప్రైవసీ LEDను పనిచేయకుండా చేసే సేవలకు సంబంధించిన ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, Marketplace లిస్టింగ్‌లను తొలగించే పనిలో ఉన్నట్లు మెటా తెలిపింది. అవసరమైతే ఇటువంటి మార్పులు చేసే వ్యక్తులు లేదా సంస్థలపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతం దశలవారీగా విడుదలవుతుండగా, మెటా స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారులందరికీ ఇది తప్పనిసరిగా అమలులోకి రానుంది.