Facebook: ఫేస్‌బుక్‌పై భారీ పెనాల్టీ విధించిన ఈయూ
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నియంత్రణ సంస్థ ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాపై దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది. మెటా తన మార్కెట్ స్థితిని ఉపయోగించి ఆన్‌లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో 'పోటీ వ్యతిరేక చర్యలు' చేపట్టిందని యూరోపియన్ కమిషన్ పేర్కొంది. దీర్ఘకాల దర్యాప్తు తరువాత 797.72 మిలియన్ యూరోల (841 మిలియన్ డాలర్ల) అపరాధాన్ని విధించినట్టు వెల్లడించింది. ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ అవసరం లేకపోయినా వ్యాపార ప్రకటనలను ఆటోమేటిక్‌గా చూపించిందని ఆరోపించింది. అదే విధంగా,ఇతర పోటీదారుల యాడ్ సమాచారాన్ని ఉపయోగించి అనవసరమైన ధోరణులను పాటించిందని తెలిపింది. అయితే,ఈ నిర్ణయంపై మెటా అసమ్మతిని వ్యక్తం చేస్తూ, పోటీదారులకు, వినియోగదారులకు నష్టం జరిగినట్టు నిరూపించడంలో కమిషన్ విఫలమైందని పేర్కొని అప్పీల్ చేయనున్నట్లు తెలియజేసింది.