Meta's Muse: మెటా మ్యూస్‌ను వెనక్కి నెట్టిన చికెన్ యాప్.. యాప్ స్టోర్‌లో అనూహ్య పరిణామం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఐఓఎస్ యాప్ స్టోర్‌లో సెప్టెంబర్ ప్రారంభంలో విడుదలైనప్పటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న మెటా (Meta) సంస్థకు చెందిన మ్యూస్ పర్సనల్ ఏఐ యాప్ అనూహ్యంగా తన మొదటి స్థానాన్ని కోల్పోయింది. డేవ్స్ హాట్ చికెన్ (Dave's Hot Chicken) రెస్టారెంట్ చైన్ యాప్ దాన్ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరింది. ఆ రెస్టారెంట్ ఉచిత చికెన్ స్లైడర్ అందిస్తామని ప్రకటించడంతో యాప్ డౌన్లోడ్లు భారీగా పెరిగాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీల కొత్త ఉత్పత్తుల కంటే ఆకర్షణీయమైన ప్రమోషన్లు కొన్నిసార్లు ఎక్కువ ప్రభావం చూపగలవని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
వివరాలు
మెటా తొలి అత్యాధునిక ఏఐ మోడల్
ఈ పరిణామాల మధ్య మెటా తన తాజా కృత్రిమ మేధ (AI) మోడల్ మ్యూస్ వండర్ (Muse Wonder)ను విడుదల చేసింది.
డిజిటల్ అసిస్టెంట్లకు శక్తినిచ్చే అత్యంత అధునాతన మోడల్ ఇదేనని సంస్థ పేర్కొంది.
మెటా ఏఐ విభాగం అధిపతి అలెగ్జాండర్ వాంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యక్తిగత, వృత్తిపరమైన పనులు నిర్వహించే ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో మ్యూస్ వండర్‌ను అభివృద్ధి చేశారు.
కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. వినియోగదారులకు ఉపయోగపడే పనులను స్వయంగా నిర్వహించగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై మెటా దృష్టి సారించింది.
వివరాలు
చందా చెల్లిస్తేనే మ్యూస్ వండర్ సేవలు
మ్యూస్ పర్సనల్ ఏజెంట్ యాప్ ద్వారా మ్యూస్ వండర్ సేవలను పొందాలంటే చందా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంచుకునే ప్లాన్‌ను బట్టి నెలకు 20 డాలర్లు లేదా 100 డాలర్లు ఖర్చవుతుంది.
ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్న మెటా.. చెల్లింపు ఆధారిత ఏఐ సేవల వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
అయితే, ఏఐ రంగంలో పోటీ తీవ్రంగా ఉంది. వినియోగదారులను ఆకర్షించేందుకు పలు సంస్థలు భిన్నమైన ధరలు, ప్రత్యేక ఫీచర్లతో తమ ఏఐ అసిస్టెంట్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
వివరాలు
ఉచిత ఆఫర్‌తో అగ్రస్థానం.. మళ్లీ పుంజుకున్న మ్యూస్
డేవ్స్ హాట్ చికెన్ యాప్ అగ్రస్థానానికి చేరినంత మాత్రాన వినియోగదారులు ఏఐ కంటే చికెన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని భావించలేం.
ఉచిత చికెన్ స్లైడర్ ఆఫర్ కారణంగానే ఆ యాప్ డౌన్లోడ్లు పెరిగినట్లు తెలుస్తోంది.
అయితే, ఒకవైపు మెటా అత్యాధునిక ఏఐ మోడళ్ల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతుండగా.. మరోవైపు ఓ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ ఉచిత ఆఫర్ తన యాప్‌ను అగ్రస్థానం నుంచి కిందికి నెట్టడం ఆసక్తికరంగా మారింది.
అయినప్పటికీ, మ్యూస్ యాప్ మళ్లీ అమెరికా యాప్ స్టోర్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.