'TRIBE v2': Meta కొత్త AI మోడల్ 'TRIBE v2'.. మెదడు స్పందనలను ముందే అంచనా వేస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్ దిగ్గజం మెటా మరో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను పరిచయం చేసింది. 'TRIBE v2' (Trimodal Brain Encoder) పేరుతో వచ్చిన ఈ మోడల్ మనిషి మెదడు ఎలా స్పందిస్తుందో ముందుగానే అంచనా వేయగలదు. చూపు, శబ్దం, భాష వంటి అంశాలకు మెదడు ఇచ్చే ప్రతిస్పందనలను ఇది అర్థం చేసుకుని విశ్లేషిస్తుంది. ఈ ఫౌండేషన్ మోడల్ ముందే ట్రెయిన్ చేసిన ఆడియో, వీడియో, టెక్స్ట్ డేటాను ఉపయోగించి మెదడు యాక్టివిటీని అంచనా వేస్తుంది. భవిష్యత్తులో న్యూరల్ యాక్టివిటీకి డిజిటల్ ట్విన్స్ రూపొందించడంలో ఇది సహాయపడుతుందని Meta భావిస్తోంది. అలాగే న్యూరోలాజికల్ వ్యాధుల చికిత్సలో కొత్త మార్గాలను ఇది తెరవవచ్చని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
వివరాలు
700 మందికిపైగా వాలంటీర్ల డేటాతో ట్రైనింగ్
TRIBE v2 అన్ని రకాల స్టిములీ, టాస్కులు, వ్యక్తుల మధ్య సమానంగా పని చేసేలా ట్రాన్స్‌ఫార్మర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ మోడల్‌ను 700 మందికిపైగా వాలంటీర్ల బ్రెయిన్ ఇమేజింగ్ డేటాతో ట్రైన్ చేశారు. గత వెర్షన్‌లతో పోలిస్తే ఇది పెద్ద మెరుగుదలగా భావిస్తున్నారు. ఈ ట్రైనింగ్‌లో భాగంగా పాల్గొన్న వారికి పాడ్‌కాస్ట్‌లు, సినిమాలు, చిత్రాలు, టెక్స్ట్ వంటి వివిధ మీడియాను చూపించారు. అదే సమయంలో వారి మెదడు స్పందనలను Functional Magnetic Resonance Imaging (fMRI) ద్వారా రికార్డ్ చేశారు.
వివరాలు
70 రెట్లు అధిక రిజల్యూషన్‌తో కొత్త మోడల్
TRIBE v2, fMRI డేటాలోని ప్యాటర్న్‌లను నేర్చుకుని, స్కాన్ చేయకుండానే మెదడు ఎలా కనిపిస్తుందో అంచనా వేయగలదు. Meta ప్రకారం, ఈ మోడల్ ఇతర సిస్టమ్‌లతో పోలిస్తే 70 రెట్లు ఎక్కువ రిజల్యూషన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా వేగం, ఖచ్చితత్వం కూడా గణనీయంగా మెరుగయ్యాయి. ఇది "జీరో-షాట్ ప్రిడిక్షన్" అనే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే కొత్త వ్యక్తులు, కొత్త భాషలు, కొత్త పనుల కోసం మోడల్‌ను మళ్లీ ట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా మెదడు స్పందనలను అంచనా వేయగలదు.