Facebook: ఇక ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే ఫుల్‌స్క్రీన్ వీడియోలు.. భారత్‌లో కొత్త ఫీచర్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఫేస్ బుక్ యూజర్లకు ఇకపై యాప్ ఓపెన్ చేయగానే సరికొత్త అనుభవం ఎదురుకానుంది. ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన వెంటనే సన్నిహితుల పోస్టులు, గ్రూప్‌లకు సంబంధించిన కంటెంట్ కనిపించేది. అయితే మెటా (Meta) ఇప్పుడు ఈ విధానంలో మార్పులు చేస్తోంది. ఇకపై ఫేస్‌బుక్ తెరిచిన వెంటనే ఫుల్‌స్క్రీన్‌లో షార్ట్ వీడియోలు కనిపించేలా కొత్త 'వీడియో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్'ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను భారత్‌లోని కొందరు యూజర్లకు అందించినట్లు సమాచారం. ఈ మార్పుతో ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన వెంటనే షార్ట్స్ తరహా వీడియోలు స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేలా కనిపించనున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సాధారణ ఫీడ్‌ను మాత్రం మెటా పూర్తిగా తొలగించడం లేదు.
వివరాలు
విజువల్ కంటెంట్, వీడియో ఫార్మాట్‌లపై యూజర్ల ఆసక్తి
సాధారణ ఫీడ్‌ను ప్రత్యేక ట్యాబ్‌లోకి మార్చనుంది. పాత తరహా ఫేస్‌బుక్ ఫీడ్ అనుభవాన్నే కొనసాగించాలనుకునే యూజర్ల కోసం సింగిల్ ట్యాబ్ ద్వారా క్లాసిక్ ఫీడ్‌కు మారే అవకాశం కల్పించనుంది.
అంటే వీడియోలను ముందుగా చూడాలనుకునే వారికి కొత్త వీడియో ఫస్ట్ అనుభవం, సంప్రదాయ ఫీడ్‌ను ఇష్టపడేవారికి ప్రత్యేక ట్యాబ్ అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త మార్పు గురించి ఫేస్‌బుక్ హెడ్ టామ్ అలిసన్ ఈ ఏడాది జులైలోనే వెల్లడించారు.
యూజర్లు ప్రస్తుతం విజువల్ కంటెంట్, వీడియో ఫార్మాట్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.
వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఫేస్‌బుక్ యాప్‌ను రీడిజైన్ చేస్తున్నట్లు వివరించారు.
వివరాలు
ప్రస్తుతం కొందరు భారతీయ యూజర్లకు ఈ ఫీచర్
యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు రెండో ట్యాబ్‌లో సంప్రదాయ క్లాసిక్ ఫీడ్‌ను కూడా కొనసాగించనున్నట్లు టామ్ అలిసన్ పేర్కొన్నారు.
దీంతో కొత్త వీడియో అనుభవాన్ని కోరుకునే వారు షార్ట్స్‌ను చూడవచ్చు.
పాత ఫీడ్‌ను ఇష్టపడేవారు క్లాసిక్ ఫీడ్ ట్యాబ్‌ను ఎంచుకోవచ్చు. టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం.. ఈ కొత్త వీడియో ఫస్ట్ అనుభవాన్ని మెటా తొలుత భారత్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం కొందరు భారతీయ యూజర్లకు ఈ ఫీచర్ కనిపిస్తోంది. త్వరలోనే ఇతర దేశాల్లోని ఫేస్‌బుక్ యూజర్లకు కూడా ఈ కొత్త విధానాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది.