Immunotherapy: గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీతో రెయిన్‌బో వైద్యుల విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య శాస్త్రంలో మరో అపూర్వమైన విజయాన్ని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సాధించింది. గర్భంలో ఉన్న పిండానికి గుండె సమస్యను గుర్తించి, అత్యంత క్లిష్టమైన 'ఇమ్యునోథెరపీ' చికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ వైద్య రంగ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో కొన్ని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ అరుదైన చికిత్సను నేరుగా పిండానికే అందించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురు శిశువులను కాపాడటంలో వైద్య బృందం సఫలమైంది. గతంలో గర్భస్రావం ఎదుర్కొన్న 29 ఏళ్ల మహిళ గర్భధారణ సమయంలో రెయిన్‌బో ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల్లో పిండం గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయకపోవడం, గుండె చప్పుడు అత్యంత తక్కువగా ఉండటం వైద్యులు గుర్తించారు.
Details
ఆరోగ్యకరమైన శిశువుకు మహిళ జననం
ఈ దశలో చికిత్స చేయకపోతే గుండె వైఫల్యంతో పిండం మృతి చెందే ప్రమాదం ఉందని స్పష్టం అయ్యింది. ఈ సవాలును స్వీకరించిన మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం, అత్యాధునిక ఇమేజింగ్ టెక్నాలజీ సహాయంతో నేరుగా పిండానికే 'ఇమ్యునోథెరపీ' అందించింది. ఈ అరుదైన చికిత్స అనంతరం పిండం గుండె పనితీరు క్రమంగా మెరుగుపడింది. చివరికి ఆ మహిళ ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చారు. తల్లిలో ఉన్న స్జోగ్రెన్స్ సిండ్రోమ్ లేదా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల కారణంగా యాంటీబాడీలు తల్లి నుంచి పిండానికి చేరుతాయని, అవే పిండం గుండెపై దాడి చేసి దాని పనితీరును దెబ్బతీస్తాయని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బఖ్రు వివరించారు.
Details
ఐదుగురు మహిళలకు ఈ చికిత్స
తల్లిలో స్పష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల ఈ సమస్యను ముందుగానే గుర్తించడం కష్టమవుతుందని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 21 నుంచి 27 వారాల గర్భధారణలో ఉన్న ఐదుగురు మహిళలకు ఈ చికిత్సను అందించారు. అసాధారణంగా పెరిగిన ఉమ్మనీరు సమస్యను నియంత్రించడంతో పాటు, గుండె పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచి, ఐదుగురు శిశువులు సురక్షితంగా, ఆరోగ్యంగా జన్మించేలా వైద్యులు చర్యలు చేపట్టారు. ఈ వినూత్న చికిత్సకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన JACC (జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ)లో ప్రచురితమయ్యాయి.
Details
అత్యంత ప్రత్యేక పర్యవేక్షణతో ఈ చికిత్స
డాక్టర్ భార్గవి ధూళిపూడి మాట్లాడుతూ.. ఇది సాధారణ చికిత్స కాదని, తల్లిలో వ్యాధి తీవ్రత ఉండి, శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అత్యంత ప్రత్యేక పర్యవేక్షణతో ఈ చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి స్పందిస్తూ.. రోగనిరోధక సంబంధిత పిండం గుండె జబ్బుల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అనుభవమున్న అతి కొద్ది సంస్థల సరసన రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చేరిందని పేర్కొన్నారు.