LOADING...
Elon Musk: ఏఐ రేసులో మస్క్ స్పీడ్ .. xAIకి మూడో భారీ డేటా సెంటర్
ఏఐ రేసులో మస్క్ స్పీడ్ .. xAIకి మూడో భారీ డేటా సెంటర్

Elon Musk: ఏఐ రేసులో మస్క్ స్పీడ్ .. xAIకి మూడో భారీ డేటా సెంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా, స్పేస్‌-X అధినేత ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తున్నారు. ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఆయన స్థాపించిన 'ఎక్స్‌ఏఐ' (xAI) సంస్థ ఇటీవల అమెరికాలో మరో పెద్ద భవనాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే మెమ్ఫిస్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, ఆ ప్రాంతానికి సమీపంలోనే మూడవ భవనాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ కొత్త భవనానికి 'మాక్రోహార్డర్'(Macrohardrr)అని మస్క్ 'ఎక్స్'(ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. ఈ కొనుగోలుతో తమ ఏఐ ట్రైనింగ్ సామర్థ్యం సుమారు 2 గిగావాట్లకు చేరుతుందని ఆయన వివరించారు. సాధారణంగా ఒక గిగావాట్ విద్యుత్ సుమారు 7.5లక్షల ఇళ్లకు సరిపోతుంది.దీన్ని బట్టి మస్క్ ఏఐ డేటా సెంటర్ల సామర్థ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

వివరాలు 

మస్క్ మెమ్ఫిస్‌లో 'కొలోసస్' డేటా సెంటర్

మిసిసిపీలోని సౌత్‌హెవెన్‌లోని ఈ కొత్త భవనం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'కొలోసస్ 2' ఫెసిలిటీకి పక్కన ఉంది. ఇప్పటికే మస్క్ మెమ్ఫిస్‌లో 'కొలోసస్' అనే డేటా సెంటర్‌ను నడిపిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించడమే ఆయన లక్ష్యం. దీని కోసం భవిష్యత్తులో సుమారు 5,50,000 ఎన్విడియా చిప్‌లను ఉపయోగించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో, ఎక్స్‌ఏఐ సంస్థ విలువను 230 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తూ, పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ కోసం మస్క్ చర్చలు జరుపుతున్నారు.

వివరాలు 

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే దిశగా మస్క్ అడుగులు 

ఇటీవల కోర్టు తీర్పుతో టెస్లా స్టాక్ ఆప్షన్లు మళ్లీ మస్క్ వద్దకి వచ్చాయి, తద్వారా ఆయన సంపద 750 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే దిశగా మస్క్ దూసుకుపోతున్నారని ఫోర్బ్స్ అంచనా వేసింది. అయితే, మస్క్ వికీపీడియాపై మరోసారి సెటైర్లు వేశారు. వికీపీడియా పక్షపాత విధానంతో ఉందని, దానికి ప్రత్యామ్నాయంగా వారు తీసుకొచ్చే 'గ్రోక్‌పీడియా' మరింత ఖచ్చితమైన, విస్తృతమైన సమాచారాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement