Asteroid: భూమి వైపుగా దూసుకువస్తున్న భారీ గ్రహశకలం.. ముప్పు లేదన్న నాసా
మానవాళి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) భూమి దిశగా దూసుకొస్తోంది. ఈ ఆకాశ హర్మ్యం వచ్చే నెల 17న భూగోళాన్ని సమీపించి వెళ్లనుందని నాసా పేర్కొంది. ఈ గ్రహశకలం సుమారు 721 నుంచి 1,575 అడుగుల (220-480 మీటర్ల) చుట్టుకొలత కలిగి ఉంది. దీనికి '2024 ఆన్' అనే నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్ గంటకు 19,842 మైళ్ల (31,933 కి.మీ.) వేగంతో ప్రయాణిస్తున్నదని లైవ్ సైన్స్ స్పష్టం చేసింది. ఈ వేగం ధ్వని కంటే 26 రెట్లు అధికంగా ఉండనుంది.
భూమికి 62 వేల మైళ్ల దూరంలో ఉన్న ఆస్టరాయిడ్
ఈ గ్రహశకలం భూమికి దాదాపు 62 వేల మైళ్ల (లక్ష కిలోమీటర్ల) దూరంలో నుంచి వెళ్లనుంది. ఇది భూమి, చంద్రుని మధ్య సగటు దూరం కంటే 2.6 రెట్లు ఎక్కువ. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే ప్రమాదం లేదని, మానవాళికి ఎలాంటి ముప్పు వాటిల్లదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూగోళానికి 12 కోట్ల మైళ్ల (19.3 కోట్ల కిలోమీటర్ల) దూరంలో ఉన్న వస్తువులను సమీప ఖగోళ వస్తువులుగా పరిగణిస్తారు. అదేవిధంగా, 46.5 లక్షల మైళ్ల (75 లక్షల కిలోమీటర్ల) దూరంలో వచ్చే పెద్ద వస్తువులను ప్రమాదకరమైనవిగా గుర్తిస్తారు.