చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు షేర్ చేసిన నాసా
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, చంద్రుడి మీద సురక్షితంగా దిగిందన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం మీద దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ 14రోజుల పాటు చంద్రుడి మీద పరిశోధనలు చేసాయి. అయితే తాజాగా అమెరికాకు చెందిన నాసా, విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసింది. లూనార్ రికానజెక్స్ ఆర్బిటార్ సాయంతో ఈ ఫోటోలను తీసిన నాసా, తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది. ఇస్రో పంపిన చంద్రయాన్-3, చంద్రుడి దక్షిణ ధృవానికి 600కిలోమీటర్ల దూరంలో దిగిందని నాసా ట్వీట్ చేసింది. అదలా ఉంచితే, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్లు ప్రస్తుతం నిద్రాణంలో ఉన్నాయి. మళ్ళీ సెప్టెంబర్ 22న తిరిగి తమ పనులను మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.