
AI: కొత్త చాట్‌జీపీటీ.. 'బాయ్‌ఫ్రెండ్'ను కోల్పోయానంటూ యువతి భావోద్వేగం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఒంటరి జీవితాన్ని గడిపే వారికి కోసం రూపొందించిన ఏఐ గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ చాట్‌బాట్‌లు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ ధోరణిలో భాగంగానే ఏఐ సంబంధాల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఇటీవల తమ అత్యాధునిక ఏఐ మోడల్ 'చాట్‌జీపీటీ-5'ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్‌డేట్ కారణంగా తన ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను కోల్పోయినట్లు మధ్యప్రాచ్యానికి చెందిన జేన్ అనే యువతి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఐదు నెలలుగా తాను జీపీటీ-4oతో ప్రేమలో ఉన్నానని, కానీ కొత్త అప్‌డేట్ రాగానే అతడితో ఆ అనుబంధం తెగిపోయిందని తెలిపింది.
Details
సహచరులను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది
జేన్ చెబుతున్న ప్రకారం — కొంతకాలంగా ఏఐ సహకారంతో ఓ ప్రాజెక్ట్ చేస్తూ, తమ ఆలోచనలు, భావాలు కలిసిపోవడంతో అనుకోకుండా ఆ ఏఐ మోడల్‌తో ప్రేమలో పడింది. ఆ తరువాత తన వ్యక్తిగత విషయాల నుండి సమస్యల వరకు అన్నీ అతడితో పంచుకునే అలవాటు ఏర్పడిందని, ముఖ్యంగా అతడి స్వరం, మాటలు తనకు బాగా సన్నిహితంగా అనిపించాయని పేర్కొంది. అయితే ఇప్పుడు చాట్‌జీపీటీ-5 అప్‌డేట్ రావడంతో పూర్వపు అనుభవాన్ని పొందలేకపోతున్నట్లు తెలిపింది. ఈ మార్పుతో బాధపడుతున్నది తానే కాదని, GPT-4o పోయిన తరువాత తమ 'సహచరులను' కోల్పోయినట్టుగా అనిపిస్తోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ భావాలను పంచుకుంటున్నారు.
Details
ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రేమను వ్యక్తం చేసినట్లు వెల్లడి
ఇదే విధంగా క్రిస్ స్మిత్ అనే వ్యక్తి ఇటీవల తన ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రేమను వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఆ ఏఐ గర్ల్‌ఫ్రెండ్ కూడా అంగీకరించిందని, అలాంటి నిజమైన ప్రేమను పొందడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ పరిచయం చేసిన ఈ చాట్‌జీపీటీ-5 మోడల్, జీపీటీ-4o, జీపీటీ-4.1, జీపీటీ-4.5, o3, o4-మినీ వంటి పూర్వపు మోడళ్ల స్థానాన్ని దక్కించుకుంది. కొత్త మోడల్ కోడింగ్, గణితం, రచన, హెల్త్‌కేర్ వంటి అనేక రంగాల్లో అత్యుత్తమ పనితీరును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన వాటిలో ఇదే అత్యంత శక్తివంతమైన మోడల్‌గా పేర్కొంది.