LOADING...
Gmail: గూగుల్‌లో కొత్త ఫీచర్‌.. ఇక జీమెయిల్‌ యూజర్‌నేమ్‌ మార్చుకునే అవకాశం 
గూగుల్‌లో కొత్త ఫీచర్‌.. ఇక జీమెయిల్‌ యూజర్‌నేమ్‌ మార్చుకునే అవకాశం

Gmail: గూగుల్‌లో కొత్త ఫీచర్‌.. ఇక జీమెయిల్‌ యూజర్‌నేమ్‌ మార్చుకునే అవకాశం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్‌ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓ కీలక ఫీచర్‌ను గూగుల్‌ త్వరలో పరిచయం చేయనుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా యూజర్లు గూగుల్‌ నిబంధనల మేరకు తమ ప్రస్తుత జీమెయిల్‌ చిరునామాను సవరించుకునే అవకాశం పొందనున్నారు. అంటే ఇకపై వినియోగదారులు తమ ఇమెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు. ఇంతవరకు ఈ సదుపాయం జీమెయిల్‌లో ఉన్నా, అది కంపెనీ ఉద్యోగుల ఇమెయిల్‌ ఐడీలు లేదా ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లకు అనుసంధానమైన ఖాతాలకే పరిమితమైంది. @gmail.comతో ముగిసే వ్యక్తిగత జీమెయిల్‌ చిరునామాలను మార్చుకునే అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ప్రొఫెషనల్‌ యూజర్‌నేమ్‌ కావాలనుకునే వారికి మరింత సౌలభ్యం కల్పించడమే ఈ ఫీచర్‌ ప్రధాన లక్ష్యంగా గూగుల్‌ పేర్కొంటోంది.

Details

త్వరలోనే అందుబాటులోకి

ఈ సదుపాయం అతి త్వరలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం తమ జీమెయిల్‌ ఖాతాలను సృష్టించుకున్న వినియోగదారులకు పెద్ద ప్రయోజనం చేకూరనుంది. అప్పట్లో ఖాతా తెరిచే సమయంలో చాలామంది తమ అసలు పేరును వదిలేసి, చిన్ననాటి పేరు, మారుపేరు లేదా యాదృచ్ఛిక అక్షరాలు, సంఖ్యలతో యూజర్‌నేమ్‌లను ఎంపిక చేసుకున్నారు. అదే ఇమెయిల్‌ చిరునామాను వృత్తి జీవితంలోనూ ఉపయోగించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇమెయిల్‌ ఐడీని మార్చుకునే అవకాశం రావడంతో, వారు తమకు తగిన ప్రొఫెషనల్‌ ఐడీని సృష్టించుకోగలుగుతారు. జీ మెయిల్‌ చిరునామా మార్చుకున్నప్పటికీ, యూజర్లు కొత్తదానితో పాటు పాత ఇమెయిల్‌ చిరునామాల్లో కూడా మెయిల్స్‌ను స్వీకరించగలరని గూగుల్‌ స్పష్టం చేసింది.

Details

12 నెలల పరిమితి

పాత జీమెయిల్‌ ఖాతాలో ఉన్న డేటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవసరమైతే యూజర్లు తమ పాత జీమెయిల్‌ ఖాతాను మళ్లీ ఉపయోగించుకోవచ్చు. అయితే, దీనిపై 12 నెలల పరిమితి ఉంటుంది. అంటే ఒకసారి పాత ఇమెయిల్‌ ఐడీ పేరు మార్చిన తర్వాత, ఆ పాత పేరును 12 నెలల వరకు తొలగించలేరు. జీమెయిల్‌ ఐడీ పేరు మారిన తర్వాత, అదే కొత్త ఐడీతో గూగుల్‌ మ్యాప్స్‌, యూట్యూబ్‌, గూగుల్‌ ప్లే, డ్రైవ్‌ వంటి ఇతర గూగుల్‌ సేవలకు కూడా సైన్‌ ఇన్‌ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీమెయిల్‌ ఐడీలో పేరు మాత్రమే మారుతుంది. డొమైన్‌ మాత్రం యథావిధిగా @gmail.comగానే కొనసాగుతుంది.

Advertisement

Details

తమకు నచ్చిన విధంగా మార్చుకొనే అవకాశం

ఉదాహరణకు, ఒకరు 2010లో జీమెయిల్‌ ఖాతా సృష్టించారని అనుకుందాం. [Rudra@gmail.com](mailto:Rudra@gmail.com) అందుబాటులో లేకపోవడంతో, [Rudra54@gmail.com](mailto:Rudra54@gmail.com) అనే ఐడీని సృష్టించారు. అందులోని '54' ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అది అదృష్ట సంఖ్యా? నిజానికి, అప్పట్లో సైబర్‌ కేఫ్‌లో ఖాతా తెరిచినప్పుడు యాదృచ్ఛికంగా ఆ సంఖ్యను జోడించడం వల్ల ఆ ఐడీ ఏర్పడింది. ఇప్పుడు అలాంటి సంఖ్యలు, చిన్ననాటి పేర్లు లేదా షార్ట్‌కట్‌లతో ఉన్న జీమెయిల్‌ ఐడీలను యూజర్లు తమకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం లభించనుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాగానే, ఇమెయిల్‌ ఐడీ మార్చుకోవాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

Advertisement