Advanced AI Skills: భారత్‌లో ఏఐ నైపుణ్యాల కొరత.. ప్రతి ఆరుగురిలో ఒక్కరికే అడ్వాన్స్‌డ్ స్కిల్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో దాదాపు 20 లక్షల మంది ఐటీ నిపుణులకు ఏఐపై శిక్షణ ఇచ్చినప్పటికీ.. వారిలో ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాలు ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. సుమారు 3 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ ఏఐ స్కిల్స్ ఉన్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ 'డిజిటల్ స్కిల్స్ అండ్ శాలరీ ప్రైమర్ FY2026-27' నివేదిక తెలిపింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCCలు), టెక్నాలజీ కంపెనీలు, ఇతర ప్రధాన పరిశ్రమల్లోని 37,000 టెక్నాలజీ, డిజిటల్ ఉద్యోగాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
వివరాలు
ఏఐ టూల్స్ వాడటం మాత్రమే సరిపోదు
కంపెనీలు ఏఐను ప్రయోగాత్మక దశ నుంచి నేరుగా వ్యాపార కార్యకలాపాల్లో వినియోగించే దిశగా వెళ్తున్నాయి.
ఈ సమయంలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం ప్రాథమిక నైపుణ్యంగా మారుతుండగా.. ఏఐ వ్యవస్థలను నిర్మించడం, అమలు చేయడం, నిర్వహించడం, పర్యవేక్షించడం వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది.
శిక్షణ పొందిన వారి సంఖ్యకు, వాస్తవంగా అడ్వాన్స్‌డ్ ఏఐ వ్యవస్థలపై పనిచేయగల వారి సంఖ్యకు మధ్య భారీ అంతరం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ తెలిపారు.
వివరాలు
ఏఐ స్కిల్స్‌లో మూడు విభాగాలు
టీమ్‌లీజ్ టెక్నాలజీ ఉద్యోగాలను AI-Core, AI-Adjacent, AI-Support అనే మూడు విభాగాలుగా వర్గీకరించింది.
AI-Coreలో జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు ఉంటారు. వీరు ఏఐ ఆధారిత వ్యవస్థలను రూపొందించి నిర్వహిస్తారు.
AI-Adjacentలో డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉంటారు. వీరు తమ వర్క్‌ఫ్లోల్లో ఏఐను అనుసంధానిస్తారు.
AI-Support విభాగంలో ఏఐ ఆధారిత వ్యవస్థల పర్యవేక్షణ, ధ్రువీకరణ, ప్రారంభ స్థాయి సమస్యల పరిష్కారం వంటి పనులు ఉంటాయి.
వివరాలు
ఏఐ నైపుణ్యాలకు తగ్గట్లే జీతాల్లోనూ తేడా..
GCCల్లో AI-Core ఉద్యోగాల్లో ఎంట్రీ లెవల్‌లో మధ్యస్థ వార్షిక ఫిక్స్‌డ్ వేతనం రూ.13.2 లక్షలుగా ఉంది.
AI-Adjacent ఉద్యోగాల్లో ఇది రూ.9-10.2 లక్షలు కాగా.. AI-Support ఉద్యోగాల్లో రూ.4.8-5.4 లక్షలుగా ఉంది.
FY2027-28లో AI-Core ఉద్యోగాలు 16-21 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
AI-Adjacent ఉద్యోగాలు 13-18 శాతం, AI-Support ఉద్యోగాలు 7-8 శాతం వరకు వృద్ధి చెందవచ్చని పేర్కొంది.
వివరాలు
అనుభవం కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యం
టెక్నాలజీ కంపెనీల్లో 0-2 సంవత్సరాల అనుభవం ఉన్న GenAI డెవలపర్‌కు మధ్యస్థ వేతనం రూ.11.2 లక్షలుగా ఉంది. 6-8 సంవత్సరాల అనుభవానికి ఇది రూ.34.5 లక్షలకు చేరుతోంది.
అదే సమయంలో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్‌కు 0-2 సంవత్సరాల అనుభవంలో రూ.5.2 లక్షలు, 6-8 సంవత్సరాల అనుభవంలో రూ.14.6 లక్షలుగా ఉంది.
ముఖ్యంగా GenAI ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ అనలిటిక్స్, డిప్లాయ్‌మెంట్, సెక్యూరిటీ వంటి నైపుణ్యాల కలయికకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని నివేదిక తెలిపింది.
వివరాలు
ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఒత్తిడి
ఏఐలో అడ్వాన్స్‌డ్ నైపుణ్యాల కొరతతో పాటు.. కొన్ని సాధారణ టెక్నాలజీ ఉద్యోగాలపై ఒత్తిడి పెరుగుతోంది.
ఏఐ, డేటా, క్లౌడ్, ప్లాట్‌ఫామ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో గుర్తించిన 16 ప్రీమియం ఉద్యోగాల్లో నాలుగు AI-Core, 12 AI-Adjacent విభాగాలకు చెందినవే. AI-Support ఉద్యోగాలు ఒక్కటీ లేవు.
టెక్నాలజీ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు కేవలం జీతాల మార్పుతో కాకుండా.. ఆటోమేషన్ కారణంగా కుదించబడుతున్నాయని ఇది సూచిస్తోందని టీమ్‌లీజ్ తెలిపింది.
వివరాలు
GenAI ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్
FY2027-28లో GenAI డెవలపర్ ఉద్యోగాలు 16.2 శాతం పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.
ఇదే సమయంలో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు 6.6 శాతం, డేటా ఇంజినీర్ ఉద్యోగాలు 12 శాతం వృద్ధి చెందవచ్చని పేర్కొంది.
దీంతో టెక్నాలజీ రంగంలో సాధారణ పనులను నిర్వహించే ఉద్యోగాల కంటే ఏఐను నిర్మించి, వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేయగల నిపుణులకు డిమాండ్ మరింత పెరగనుంది.
వివరాలు
కంపెనీలకు రీస్కిల్లింగ్ కీలకం
అడ్వాన్స్‌డ్ ఏఐ నైపుణ్యాల కొరతను ఎదుర్కొనేందుకు కంపెనీలు కేవలం బయట నుంచి ఉద్యోగులను నియమించుకోవడంపైనే ఆధారపడకూడదని టీమ్‌లీజ్ సూచించింది.
అంతర్గతంగా ఏఐ, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంచడంతో పాటు ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వాలని పేర్కొంది.
LLMOps, AI Governance, క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి అరుదైన నైపుణ్యాలు ఉన్న వారిని అవసరానికి అనుగుణంగా నియమించుకోవాలని సూచించింది.
వివరాలు
బిజినెస్ పరిజ్ఞానానికీ ప్రాధాన్యం
భవిష్యత్తులో ఏఐ ఉద్యోగాల్లో కేవలం టెక్నికల్ నైపుణ్యాలే కాకుండా.. నిర్దిష్ట రంగంపై అవగాహన కూడా కీలకంగా మారనుందని నీతి శర్మ తెలిపారు.
ఉదాహరణకు ఆర్థిక సేవల్లో రిస్క్ అంచనా, రిటైల్‌లో డిమాండ్ అంచనా, తయారీ రంగంలో ఆపరేషనల్ టెక్నాలజీ భద్రత వంటి అంశాల్లో ఏఐను సమర్థంగా ఉపయోగించగల నిపుణులకు ప్రాధాన్యం పెరగవచ్చని నివేదిక పేర్కొంది.
మొత్తంగా చూస్తే.. భవిష్యత్ ఏఐ ఉద్యోగ మార్కెట్‌లో ఎన్ని లక్షల మందికి ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇచ్చారన్నదానికంటే, ఆ నైపుణ్యాలను ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించి ఏఐ వ్యవస్థలను వాస్తవంగా అమలు చేయగల నిపుణులు ఎంతమంది ఉన్నారన్నదే కీలకంగా మారనుంది.