Perplexity : Perplexity నుంచి కొత్త సంచలనం.. స్వయంగా ప్రాజెక్టులు చేసే AI విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు రంగంలో మరో పెద్ద అడుగు పడింది. AI కంపెనీ Perplexity తమ కొత్త సిస్టమ్ "Perplexity Computer" ను అధికారికంగా విడుదల చేసింది. ఇది సాధారణ చాట్‌బాట్ కాదని, పూర్తిగా స్వతంత్రంగా పని చేసే డిజిటల్ వర్కర్‌గా రూపొందించామని కంపెనీ చెబుతోంది. దీర్ఘకాలం పాటు ప్రాజెక్టులను స్వయంగా ప్లాన్ చేయడం, డిజైన్ చేయడం, అమలు చేయడం ఈ సిస్టమ్ ప్రత్యేకత. ఇప్పటివరకు సంభాషణలకే పరిమితమైన AI నుంచి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనిచేసే 'ఏజెంటిక్' సిస్టమ్‌ల వైపు ఇది పెద్ద మార్పుగా భావిస్తున్నారు. Perplexity Computer ఒక్క మోడల్‌తో పనిచేయదు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన రీసెర్చ్, కోడింగ్, డిప్లాయ్‌మెంట్, మేనేజ్‌మెంట్ వంటి అన్ని దశలను ఇది స్వయంగా నిర్వహించగలదు.
వివరాలు
19 వేర్వేరు AI మోడళ్లతో కలిసి పనిచేస్తుంది
క్లిష్టమైన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి, వాటిని వేర్వేరు ప్రత్యేక AI మోడళ్లకు అప్పగిస్తుంది. ఇలా 19 వేర్వేరు AI మోడళ్లతో కలిసి పనిచేసే ఈ సిస్టమ్ రీజనింగ్, కోడింగ్, రీసెర్చ్, ఇమేజ్ జనరేషన్ వంటి పనులను సమర్థంగా చేస్తుంది. యూజర్ తాను కోరుకున్న ఫలితాన్ని చెప్పగానే, దానికి అనుగుణంగా పూర్తి వర్క్‌ఫ్లోను తయారు చేసి అమలు చేస్తుంది.
వివరాలు
భద్రతకు పెద్దపీట
అవసరమైతే వెబ్ రీసెర్చ్, డాక్యుమెంట్ తయారీ, డేటా ప్రాసెసింగ్, బయటి సర్వీసులతో కనెక్ట్ అవ్వడం కూడా చేస్తుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి టాస్క్‌ను వేరే కంప్యూట్ ఎన్విరాన్‌మెంట్‌లో నిర్వహిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సిస్టమ్ Perplexity Max సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక ఎంటర్‌ప్రైజ్, ప్రో యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. మొత్తం మీద చూస్తే, AI రంగంలో ఇది కొత్త యుగానికి నాంది పలికినట్టే అని నిపుణులు చెబుతున్నారు.