Loading...
Revolution in medical: వైద్య రంగంలో విప్లవం.. జీవకణాలను లైవ్‌గా చూసే టెక్నాలజీ!
వైద్య రంగంలో విప్లవం.. జీవకణాలను లైవ్‌గా చూసే టెక్నాలజీ!

Revolution in medical: వైద్య రంగంలో విప్లవం.. జీవకణాలను లైవ్‌గా చూసే టెక్నాలజీ!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైద్య రంగంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా క్యాన్సర్ పరిశోధన, డ్రగ్ డిస్కవరీ, ప్రిసిషన్ మెడిసిన్ వంటి విభాగాల్లో ఇది కీలక మార్పులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సజీవంగా ఉన్న కణాలను నిరంతరం పరిశీలిస్తూ.. వాటిలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. క్యాన్సర్ చికిత్సలో మరింత కచ్చితత్వాన్ని సాధించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రయోగశాలల్లో కణాలను పరిశీలించాలంటే వాటికి ప్రత్యేక రంగులు వేయడం, కణాలను నిర్జీవంగా మార్చడం లేదా వాటిని విచ్ఛిన్నం చేయడం వంటి పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అయితే కొత్తగా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌తో అలాంటి ప్రక్రియలు అవసరం లేకుండానే కణాలను వాటి సహజ స్థితిలో పరిశీలించవచ్చు.

వివరాలు

వాటిని అంచనా  వేసిన శాస్త్రవేత్తలు..

కణాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి? వాటిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి?

అనే విషయాలను నిరంతరం గమనించే అవకాశం ఉంటుంది. దీంతో కణాలపై ఔషధాలు ఎలా పనిచేస్తున్నాయన్నది మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత సంతతికి చెందిన బయోటెక్ ఆంట్రప్రెన్యూర్, శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రెసిజెనెటిక్స్ (Precigenetics) సీఈఓ పరిమితా మిశ్రా ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. నిర్జీవ కణాలపై నిర్వహించే 'జీవసంబంధ శవపరీక్షల'పై ఆధారపడకుండా, సజీవ కణాల ప్రవర్తనను నిరంతరం కొలవడం ద్వారా ఇప్పటివరకు గుర్తించలేని ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ టెక్నాలజీ కేవలం క్యాన్సర్ పరిశోధనకే పరిమితం కాదని.. ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్, అరుదైన వ్యాధులు తదితర అనేక వైద్య రంగాల్లోనూ ఉపయోగపడుతుందని తెలిపారు.

వివరాలు

మెరుగైన చికిత్స అందించే అవకాశం..

ఈ టెక్నాలజీ ప్రాధాన్యతను న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ అగర్వాల్ కూడా వివరించారు.

ఔషధాలకు కణాలు ఎలా స్పందిస్తున్నాయో నిజ సమయంలో గమనించగలిగితే పరిశోధన ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆయన అన్నారు.

ప్రీ-క్లినికల్ దశలోనే సరైన మందులను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు.

కాంప్రహెన్సివ్ జీనోమ్ ప్రొఫైలింగ్ (సీజీపీ), మినిమల్ రెసిడ్యువల్ డిసీజ్ డిటెక్షన్ (ఎంఆర్‌డీ) వంటి విధానాలతో కలిపి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన వ్యక్తిగత చికిత్స అందించే అవకాశం ఉంటుందని చెప్పారు.

ADVERTISEMENT