Rogue black holes: గెలాక్సీల నుంచి విడిపోయిన బ్లాక్ హోల్స్‌లో విశ్వ రహస్యాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షంలో తమ సొంత గెలాక్సీల నుంచి విడిపోయి సంచరిస్తున్న 'రోగ్ బ్లాక్ హోల్స్'.. తాము విడిచివచ్చిన గెలాక్సీల చరిత్రను తమలో దాచుకుని ఉండొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. గెలాక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొని విలీనమైనప్పుడు వాటి మధ్యలో ఉన్న బ్లాక్ హోల్స్ కూడా తమ గెలాక్సీల నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు. ముఖ్యంగా చిన్న గెలాక్సీల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండటంతో బ్లాక్ హోల్స్ గెలాక్సీ కేంద్రం నుంచి సులభంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది.
వివరాలు
రోగ్ బ్లాక్ హోల్స్ ప్రాధాన్యం
సాధారణంగా గెలాక్సీల కేంద్రాల్లో ఉండే సూపర్‌మాసివ్ బ్లాక్ హోల్స్.. వాటి పరిణామంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
అయితే గెలాక్సీల నుంచి దూరంగా సంచరించే బ్లాక్ హోల్స్ కూడా గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి,ఎలా మారాయి అనే విషయాలను తెలుసుకోవడానికి కీలక ఆధారాలుగా ఉపయోగపడొచ్చు.
యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు ఎమ్మా జేన్ వెల్లర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బ్లాక్ హోల్స్‌తో పాటు సంచరిస్తున్న బ్లాక్ హోల్స్‌ను కూడా పరిశీలించడం అవసరమని చెప్పారు. భారీ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడ్డాయి, వాటి గెలాక్సీల చరిత్ర ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
వివరాలు
బ్లాక్ హోల్స్ పుట్టుకపై ఉన్న సందేహాలకు సమాధానం
ప్రారంభ విశ్వంలో బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడ్డాయన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తల మధ్య చర్చనీయాంశంగానే ఉంది.
కొందరు శాస్త్రవేత్తల ప్రకారం..భారీ నక్షత్రాలు కుప్పకూలడం ద్వారా చిన్న పరిమాణంలోని 'లైట్ సీడ్స్' ఏర్పడి, అవి కాలక్రమంలో పెద్ద బ్లాక్ హోల్స్‌గా మారాయి.
మరికొందరి అభిప్రాయం ప్రకారం.. గ్యాస్,ధూళి మేఘాల్లోని అత్యంత దట్టమైన ప్రాంతాలు నేరుగా కుప్పకూలి పెద్ద పరిమాణంలోని'హెవీ సీడ్స్'గా మారాయి.
రోగ్ బ్లాక్ హోల్స్ తమ పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని మోసుకెళ్తే.. బ్లాక్ హోల్స్ మూలాలపై ఉన్న ఈ చర్చకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
యేల్ యూనివర్సిటీకి చెందిన ప్రియంవద నటరాజన్ మాట్లాడుతూ..బ్లాక్ హోల్స్ తమ పుట్టుకకు సంబంధించిన పరిస్థితులకంటే మరెన్నో విషయాలను తమలో దాచుకున్నట్లు తమ పరిశోధనలో తేలడం ఆసక్తికరంగా ఉందన్నారు.
వివరాలు
విశ్వ చరిత్రను అనుసరించిన పరిశోధన
పరిశోధకులు 'ASTRID' అనే కాస్మాలజికల్ సిమ్యులేషన్‌ను ఉపయోగించారు.
దీని ద్వారా దాదాపు 13.5 బిలియన్ సంవత్సరాల విశ్వ చరిత్రను పరిశీలించవచ్చు.
బిగ్ బ్యాంగ్ జరిగిన సుమారు 30 కోట్ల సంవత్సరాల తర్వాతి దశ నుంచి డార్క్ మ్యాటర్ నిర్మాణం, గ్యాస్ కదలికలు, నక్షత్రాల ఏర్పాట్లు వంటి అంశాల పరస్పర ప్రభావాలను ఈ సిమ్యులేషన్‌లో నమూనాగా రూపొందించారు.
తక్కువ ద్రవ్యరాశి ఉన్న గెలాక్సీల్లో బ్లాక్ హోల్స్ సంచరించే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
అంతేకాకుండా ఇలాంటి చిన్న గెలాక్సీలు.. కోట్ల సంవత్సరాల పాటు పెరిగి, ఇతర గెలాక్సీలతో విలీనమైన తర్వాత కూడా తమ ప్రారంభ బ్లాక్ హోల్ సీడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కొంతవరకు నిలుపుకుంటున్నట్లు తేలింది.
వివరాలు
విశ్వ చరిత్రను దాచుకున్న 'కాస్మిక్ ఆర్కైవ్స్'
విశ్వం గురించి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించే బ్లాక్ హోల్స్‌లో.. తమ గెలాక్సీల నుంచి దూరంగా సంచరించినవీ ఉండొచ్చని ప్రియంవద నటరాజన్ పేర్కొన్నారు.
బ్లాక్ హోల్స్‌ను విశ్వానికి సంబంధించిన అద్భుతమైన 'ఆర్కైవ్స్'గా ఆమె అభివర్ణించారు.
వాటి సంఖ్య, విస్తృతి అవి ఎలా పుట్టాయనే విషయాన్ని సూచిస్తే.. అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయం వాటి గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయన్న చరిత్రను తెలియజేస్తుందని వివరించారు.
ఈ విధానాన్ని వివిధ ఖగోళ పరిశీలనలతో కలిపి అధ్యయనం చేస్తే.. బ్లాక్ హోల్స్ అసలు ఎలా ఏర్పడ్డాయన్న విషయంపై శాస్త్రవేత్తలు మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.