Familiar: ఒంటరితనానికి చెక్… కొత్త AI రోబో 'ఫ్యామిలియర్' వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
రూమ్బా వెనుక ఉన్న మేధావి, కాలిన్ యాంగిల్(Colin Angle)మరోసారి కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. ఆయన స్థాపించిన iRobot మాజీ సీఈఓగా పనిచేసిన తర్వాత, ఇప్పుడు "Familiar Machines & Magic" అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ రూపొందించిన తొలి ఉత్పత్తి "ఫ్యామిలియర్" అనే కుక్క సైజ్లో ఉండే AI రోబోటిక్ పెట్. నాలుగు కాళ్లపై ఇంట్లో తిరుగుతూ నిజమైన పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేలా దీన్ని డిజైన్ చేశారు. జనరేటివ్ AI సహాయంతో యజమానితో మమేకమై, కాలక్రమేణా ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలున్న కుటుంబాలు, ఒంటరితనం ఎదుర్కొంటున్న వారికి ఇది తోడుగా ఉండేలా రూపొందించారు.
వివరాలు
మాటలు, శబ్దాలు, హావభావాలతో కమ్యూనికేట్ చేయడం దీని ప్రత్యేకత
ఇంకా మార్కెట్లోకి రాని ఈ రోబోకు "Ami" అనే కోడ్నేమ్ పెట్టారు. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుండగా, ఖర్చు పెంపుడు జంతువుల ఖర్చుతో సమానంగా ఉంటుందని అంచనా. ఇది మనిషిలా కనిపించకుండా, ఒక ప్రత్యేక ఆకారంలో రూపొందించబడింది. మాటలతో కాకుండా, శబ్దాలు, హావభావాలతో కమ్యూనికేట్ చేయడం దీని ప్రత్యేకత. ఎన్విడియా జెట్సన్ ఓరిన్ చిప్తో పనిచేసే ఈ రోబో, ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ, డేటాను క్లౌడ్కు పంపదు. భవిష్యత్తులో ఇలాంటి AI రోబోలు మనుషులతో భావోద్వేగ అనుబంధాన్ని పెంచి, ఒంటరితనం సమస్యకు పరిష్కారం చూపుతాయని కాలిన్ ఆంగిల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.