Sperm Whales: నిటారుగా నిద్రించే స్పెర్మ్ వేల్‌లు.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన పరిశోధన
ఈ వార్తాకథనం ఏంటి
సముద్ర జీవుల ప్రపంచం ఇప్పటికీ ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు నిర్వహించే తాజా పరిశోధనలు వాటి జీవన విధానంలో దాగి ఉన్న ఆసక్తికర అంశాలను వెలికితీస్తున్నాయి. అలాంటి పరిశోధనల్లో తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద దంతాలున్న తిమింగలాల్లో ఒకటైన స్పెర్మ్ వేల్ నిద్రించే విధానం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మనుషులు లేదా భూమిపై జీవించే ఇతర జంతువుల మాదిరిగా కాకుండా, ఇవి సముద్రంలో నిటారుగా నిల్చున్నట్టే విశ్రాంతి తీసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమయంలో నీటిలో స్థిరంగా తేలి ఉండేందుకు చిన్న చిన్న గాలి బుడగలను విడుదల చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
ప్రత్యేక భంగిమ వల్ల స్పెర్మ్ వేల్‌లకు పలు ప్రయోజనాలు
ఈ అంశాన్ని తెలుసుకునేందుకు సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ న్యూషాటెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు నార్వే తీర ప్రాంతంలో సంచరించే స్పెర్మ్ వేల్‌లకు ప్రత్యేక సక్షన్-కప్ ట్యాగ్‌లను అమర్చారు.
వాటి కదలికలు, శబ్దాలు, శరీర భంగిమలను రికార్డు చేసి విశ్లేషించగా విశ్రాంతి సమయంలో ఈ తిమింగలాలు దాదాపు కదలకుండా నీటిలో నిటారుగా నిలిచి ఉంటాయని గుర్తించారు.
ఈ భంగిమలో తల నీటి ఉపరితలం వైపు ఉండగా, శరీరం కిందికి వేలాడుతూ ఉంటుంది.
ఇతర తిమింగల జాతుల్లో ఇలాంటి నిద్ర తీరు ఇప్పటివరకు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.
ఈ ప్రత్యేక భంగిమ వల్ల స్పెర్మ్ వేల్‌లకు పలు ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
స్పెర్మ్ వేల్‌ల తలలో స్పెర్మాసెటి ఆయిల్ అనే ప్రత్యేక అవయవం
నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే శ్వాస తీసుకోవడానికి నీటి ఉపరితలానికి సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
అలాగే సముద్ర అలల ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. లోతైన నీటిలోకి అనవసరంగా కొట్టుకుపోకుండా శక్తిని ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఈ కారణాల వల్లే అవి ఈ ప్రత్యేకమైన నిద్ర విధానాన్ని అలవాటు చేసుకున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.
స్పెర్మ్ వేల్‌ల తలలో స్పెర్మాసెటి ఆయిల్ అనే మైనంలాంటి పదార్థంతో నిండిన ప్రత్యేక అవయవం ఉంటుంది.
ఇది వాటి తేలికపాటు, శరీర సమతుల్యతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే విశ్రాంతి సమయంలో ఊపిరితిత్తుల్లోని గాలి విస్తరించడం వల్ల అవి పైకి తేలే అవకాశం ఉంటుంది.
వివరాలు
పరిశోధనలో మరో ఆసక్తికర విషయం
అలాంటి పరిస్థితిని సమతుల్యం చేయడానికి ఈ తిమింగలాలు చిన్న చిన్న గాలి బుడగలను విడుదల చేస్తాయి.
దీంతో నీటిలో దాదాపు బరువులేనట్టుగా స్థిరంగా తేలుతూ ప్రశాంతంగా నిద్రపోగలుగుతాయి.
ఈ పరిశోధనలో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
స్పెర్మ్ వేల్‌లు ఈ సూక్ష్మ సమతుల్యతను నిద్రలోనే నియంత్రించగలగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
భూమిపై నివసించే జంతువుల్లో ఇప్పటివరకు ఇలాంటి ప్రవర్తన కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.
వివరాలు
కార్బన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్‌ను బయటకు పంపడంలో సహాయపడే అవకాశం
అంతేకాకుండా, ఇవి విడుదల చేసే గాలి బుడగలు శరీరంలో పేరుకుపోయే అదనపు కార్బన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్‌ను బయటకు పంపడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరిగితే సముద్ర గర్భంలో స్పెర్మ్ వేల్‌ల జీవన విధానం, వాటి శారీరక వ్యవస్థ గురించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.