LOADING...
Robot Dogs : రంగంలోకి నిశ్శబ్ద వేటగాళ్లు.. గణతంత్ర దినోత్సవంలో రోబోట్ డాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణ!
రంగంలోకి నిశ్శబ్ద వేటగాళ్లు.. గణతంత్ర దినోత్సవంలో రోబోట్ డాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణ!

Robot Dogs : రంగంలోకి నిశ్శబ్ద వేటగాళ్లు.. గణతంత్ర దినోత్సవంలో రోబోట్ డాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్నాళ్లూ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోట్ సైన్యం ఇప్పుడు భారత సైన్యంలో భాగమైంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాల్లో భాగంగా, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన రోబోటిక్ మ్యూల్స్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాధారణంగా కొండ ప్రాంతాల్లో సామాగ్రిని మోసే కంచర గాడిదలను మ్యూల్స్‌గా పిలుస్తారు. అయితే ఇప్పుడు అదే పేరుతో రూపొందిన ఈ రోబోట్ మ్యూల్స్ వాటికన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనవిగా నిలుస్తున్నాయి. భారత సైన్యం వీటిని ప్రేమగా 'సంజయ్' అని పిలుచుకుంటోంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఏరో-ఆర్క్ సంస్థ ఈ రోబోట్లను అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన విజన్-60 రోబోట్లతో పోటీ పడగల సామర్థ్యం ఈ స్వదేశీ రోబోట్ మ్యూల్స్‌కు ఉంది.

Details

ప్రత్యేకతలు ఇవే

హై-రిజల్యూషన్‌ కెమెరాలు, థర్మల్‌ సెన్సార్ల సహాయంతో ఈ రోబోట్ మ్యూల్స్ 24 గంటల పాటు నిరంతర నిఘా నిర్వహించగలవు. మైనస్‌ 40 డిగ్రీల తీవ్ర చలి నుంచి 55 డిగ్రీల మండుటెండ వరకు—ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. మనుషులు చేరలేని ఇరుకైన కొండ ప్రాంతాలు, ఘనమైన అడవుల్లోనూ ఇవి సులభంగా కదలగలవు. వీటి వీపుపై అమర్చిన రైఫిల్స్ సెకనుకు వందలాది బుల్లెట్లను కురిపించే సామర్థ్యం కలిగి ఉంటాయి. శత్రు డ్రోన్లను గుర్తించి, లాక్ చేసి కూల్చివేయడంలో ఇవి ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తాయి. భూమిలో దాచిన బాంబులు, గనులు, అలాగే రసాయన దాడులకు సంబంధించిన సంకేతాలను కూడా క్షణాల్లో గుర్తించగలవు.

Details

శత్రువుకు నిశ్శబ్ద హెచ్చరిక

ఇప్పటి వరకు చైనా, అమెరికా వంటి దేశాలకే పరిమితమైన ఈ ఆధునిక సాంకేతికత ఇప్పుడు భారత్‌ చేతికి వచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి ఈ రోబోట్ కుక్కలను మోహరించడం ద్వారా సైనికుల ప్రాణాలకు ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. శబ్దం చేయకుండా శత్రు కదలికలను గమనించి, వేటాడగల సామర్థ్యం వీటికి ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రస్తుతం ఉగ్రవాదులపై నేరుగా కాల్పులు జరపడానికి వీటికి అనుమతి లేకపోయినా, నిఘా, ఆత్మరక్షణ చర్యల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. దిల్లీ లోని కర్తవ్య పథ్‌పై వందలాది రోబోట్ కుక్కలు ఒకే లయలో కవాతు చేస్తుంటే, అది భారత రక్షణ రంగం సాధించిన సాంకేతిక ప్రగతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలవనుంది.

Advertisement