Spotify: AIతో పాటల రీమిక్స్‌లు.. స్పాటిఫై కొత్త ఫీచర్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురానుంది. AI సాయంతో పాటలకు రీమిక్స్‌లు, కవర్లు రూపొందించే కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకోసం Universal Music Group (UMG)తో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫీచర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు అదనపు చెల్లింపు సేవగా అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త టూల్ ద్వారా వినియోగదారులు స్ట్రీమింగ్‌లో ఉన్న పాటలను AIతో కొత్తగా రీమిక్స్ చేయడం, కవర్ సాంగ్స్ రూపొందించడం చేయగలరు. అయితే కళాకారులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలా వద్దా అన్నది వారి ఇష్టమే. పాల్గొనే ఆర్టిస్టులకు AI రీమిక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో రాయల్టీలు అందజేస్తామని స్పాటిఫై తెలిపింది.
వివరాలు
బాధ్యతాయుత AI ఉత్పత్తులు
గత ఏడాది అక్టోబర్‌లో స్పాటిఫై.. UMGతో పాటు Sony Music Group, Warner Music Group, Merlin, Believe వంటి ప్రధాన మ్యూజిక్ సంస్థలతో కలిసి "బాధ్యతాయుత AI ఉత్పత్తులు" అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ భాగస్వామ్యానికి ఇదే తొలి ఫలితంగా భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనే వారికి ఎంపిక స్వేచ్ఛ, న్యాయమైన పారితోషికం, కొత్త ఆదాయ అవకాశాలు, అలాగే కళాకారులు-అభిమానుల మధ్య మరింత దగ్గర సంబంధాలు పెంచడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నట్లు స్పాటిఫై వెల్లడించింది.
వివరాలు
AI టెక్నాలజీ ద్వారా కళాకారులు అభిమానులకు చేరువవుతారు
స్పాటిఫై కో-సీఈఓ అలెక్స్ నార్‌స్ట్రోమ్ మాట్లాడుతూ.. "మేము రూపొందిస్తున్న వ్యవస్థ కళాకారుల అనుమతి, గుర్తింపు, పారితోషికం అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు. అలాగే UMG సీఈఓ లూసియన్ గ్రేంజ్ కూడా ఈ AI టెక్నాలజీ ద్వారా కళాకారులు అభిమానులకు మరింత చేరువవుతారని, కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయని తెలిపారు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు అదనంగా ఎంత ఛార్జ్ వసూలు చేస్తారో స్పాటిఫై ఇంకా వెల్లడించలేదు. ఈ కొత్త ఫీచర్ సంగీత ప్రపంచంలో వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చే అవకాశముందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.