LOADING...
Super-Earth GJ 3378b: భూమికి 25 కాంతి సంవత్సరాల దూరంలో జీవానికి అనుకూల గ్రహం
భూమికి 25కాంతి సంవత్సరాల దూరంలో జీవానికి అనుకూల గ్రహం

Super-Earth GJ 3378b: భూమికి 25 కాంతి సంవత్సరాల దూరంలో జీవానికి అనుకూల గ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమి వెలుపల జీవం ఉండే అవకాశమున్న గ్రహాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భూమికి కేవలం 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న GJ 3378b అనే కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఇది మన సౌర కుటుంబానికి అత్యంత సమీపంలో ఉన్న నివాసయోగ్య గ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ జీవానికి అనుకూలంగా భావించే హ్యాబిటబుల్ జోన్ (Habitable Zone)లో పరిభ్రమిస్తుండటంతో దీని ఉపరితలంపై ద్రవరూపంలో నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎంతో ఉత్సాహాన్నిస్తోందని పరిశోధకుల్లో ఒకరైన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పాల్ రాబర్ట్సన్ తెలిపారు.

వివరాలు 

సూపర్ ఎర్త్‌గా GJ 3378b

GJ 3378b అనే గ్రహం కామెలోపార్డాలిస్ (Camelopardalis) నక్షత్ర మండలంలోని మందమైన ఎర్ర మరుగుజ్జు (Red Dwarf) నక్షత్రం చుట్టూ ప్రతి 21.45 రోజులకు ఒకసారి పరిభ్రమిస్తుంది. దీని ద్రవ్యరాశి భూమి కంటే సుమారు 2.3 రెట్లు ఎక్కువగా ఉండగా, వ్యాసం దాదాపు రెండు రెట్లు ఉంటుంది. దీంతో దీనిని సూపర్ ఎర్త్ వర్గంలో చేర్చారు. ఇది భూమికంటే పెద్దదైనా, వాయు గ్రహాలంత భారీగా ఉండదు. ఈ గ్రహానికి తన నక్షత్రం నుంచి అందుతున్న శక్తి భూమికి సూర్యుడి నుంచి అందే శక్తిలో దాదాపు 90 శాతం ఉంటుంది. అందువల్ల ఇది అతిగా వేడిగా లేకుండా, నీరు ద్రవరూపంలో ఉండేందుకు అనుకూల పరిస్థితులు ఉండే ప్రాంతంలో ఉంది.

వివరాలు 

ఎలా గుర్తించారు?

ఈ గ్రహాన్ని గుర్తించేందుకు ప్రపంచంలోని అత్యంత సున్నితమైన రెండు స్పెక్ట్రోగ్రాఫ్‌లను ఉపయోగించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని మెక్‌డొనాల్డ్ అబ్జర్వేటరీలో ఉన్న హ్యాబిటబుల్-జోన్ ప్లానెట్ ఫైండర్, అలాగే అరిజోనాలోని కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీలోని NEID స్పెక్ట్రోమీటర్ సేకరించిన సమాచారంతో ఈ గ్రహాన్ని ధ్రువీకరించారు. ఈ పరిశోధనకు టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మైఖేల్ ఎండల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్‌కు చెందిన డాక్టర్ పాల్ రాబర్ట్సన్ నేతృత్వం వహించారు. వారి అధ్యయనం 2026లో Astrophysical Journalలో ప్రచురితమైంది.

Advertisement

వివరాలు 

'కాస్మిక్ షోర్‌లైన్' అంటే ఏమిటి?

పరిశోధనలో ఉపయోగించిన 'కాస్మిక్ షోర్‌లైన్' అనే భావన గ్రహం తన వాతావరణాన్ని నిలబెట్టుకోగలదా లేదా అనేది అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఒకవైపు తగిన గురుత్వాకర్షణతో పాటు నక్షత్రం నుంచి వచ్చే రేడియేషన్‌ను తట్టుకుని వాతావరణాన్ని కాపాడుకునే గ్రహాలు ఉంటాయి. మరోవైపు వాతావరణాన్ని పూర్తిగా కోల్పోయిన నిర్జీవ రాతి గ్రహాలు ఉంటాయి. GJ 3378b ఈ రెండింటి మధ్య సరిహద్దులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి వాతావరణాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, అది నిజంగా ఉందా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

Advertisement

వివరాలు 

ఎర్ర మరుగుజ్జు నక్షత్రాల సవాలు

ఎర్ర మరుగుజ్జు నక్షత్రాల చుట్టూ జీవానికి అనుకూలమైన గ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, వీటికి ఒక ప్రధాన సమస్య ఉంది. ఇవి ముఖ్యంగా ప్రారంభ దశలో చాలా శక్తివంతమైన అతినీలలోహిత (Ultraviolet),ఎక్స్-రే కిరణాలు విడుదల చేస్తుంటాయి. అలాగే బలమైన నక్షత్ర గాలులు (Stellar Winds) కూడా వీటి నుంచి వస్తాయి. ఇవి కోట్లాది సంవత్సరాల కాలంలో గ్రహాల వాతావరణాన్ని క్రమంగా తొలగించే అవకాశం ఉంటుంది. GJ 3378b విషయంలో కూడా ఇదే ప్రధాన ప్రశ్నగా నిలిచింది. దీని అధిక ద్రవ్యరాశి వాతావరణాన్ని నిలబెట్టేందుకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని ప్రస్తుతం ఉన్న టెలిస్కోపులు ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నాయి.

వివరాలు 

25 కాంతి సంవత్సరాల దూరం ఎందుకు ప్రత్యేకం?

ఇప్పటివరకు గుర్తించిన చాలా నివాసయోగ్య గ్రహాలు వందల నుంచి వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంత దూరంలోని గ్రహాల వాతావరణాన్ని వివరంగా అధ్యయనం చేయడం ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో సాధ్యం కాదు. కానీ GJ 3378b మాత్రం కేవలం 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉండటంతో దీని వాతావరణాన్ని పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కొంత సమాచారం సేకరించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే 2040లలో ప్రయోగించనున్న నాసా హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ ఈ గ్రహాన్ని మరింత లోతుగా పరిశీలించి, దాని వాతావరణంలో జీవానికి సంబంధించిన రసాయన సంకేతాలు ఉన్నాయా అనే విషయాన్ని అధ్యయనం చేయనుంది.

వివరాలు 

జీవం అన్వేషణలో మరో కీలక అడుగు

GJ 3378b ఇప్పుడు మన సౌర కుటుంబానికి సమీపంలో ఉన్న జీవానికి అనుకూల గ్రహాల జాబితాలో చేరింది. ఇప్పటికే 4.2కాంతి సంవత్సరాల దూరంలోని ప్రోక్సిమా సెంటౌరీ b కూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ, దాని నివాసయోగ్యతపై ఇంకా సందేహాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు చూస్తే,మన పాలపుంత గెలాక్సీలోని సమీప ఎర్ర మరుగుజ్జు నక్షత్రాల చుట్టూ ఇలాంటి నివాసయోగ్య గ్రహాలు చాలా సాధారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే వాటిలో నిజంగా జీవం ఉందా? కనీసం స్థిరమైన వాతావరణం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు రాబోయే తరం శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోపులు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం ఆ అన్వేషణలో అత్యంత ఆశాజనక లక్ష్యాల్లో GJ 3378b ఒకటిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement