Super El Nino: ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో భయం.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని వారు 'సూపర్ ఎల్‌నినో'గా పేర్కొంటున్నారు. ఇది జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పాటు, వర్షాకాల గాలుల స్వభావం అసాధారణంగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మే నెలలోనే ఎల్‌నినో ఏర్పడి, ఆగస్టు నాటికి మరింత బలపడుతుందని వాతావరణ పరిశోధకులు అంచనా వేశారు. ఆగస్టు నాటికి సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశాన్ని తక్కువగా అంచనా వేసినా, బలమైన స్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సాధారణ స్థాయిలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు దాదాపు ఖచ్చితమని భావిస్తున్నారు.
వివరాలు
సూపర్ ఎల్‌నినో అంటే ఏమిటి?
పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం ఎల్‌నినోగా పిలుస్తారు. ఇది సంభవించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారిపోవడంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి సుమారు 2.5 డిగ్రీలకుపైగా పెరిగితే దానిని సూపర్ ఎల్‌నినోగా పరిగణిస్తారు. ప్రస్తుత వాతావరణ సూచనలు చూస్తే ఈసారి ఆ స్థాయిని మించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో ఇలాంటి తీవ్రమైన ఎల్‌నినో ప్రభావాలు కనిపించాయి. అయితే ఈసారి ఏర్పడే అవకాశం ఉన్నది గత వందేళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఇది ప్రారంభమై, ఏడాది చివరి వరకు కొనసాగవచ్చని భావిస్తున్నారు.
వివరాలు
ప్రధాన ప్రభావాలు ఇవే:
అధిక ఉష్ణోగ్రతలు: ప్రపంచవ్యాప్తంగా ఎండలు తీవ్రమవుతాయి. పలు ప్రాంతాల్లో కొత్తగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షపాతంలో అసమానతలు: కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, వరదలు సంభవించవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడే ప్రమాదం ఉంది. తుపానుల ప్రభావం: అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో తుపానుల ప్రభావం తగ్గవచ్చు. అయితే పసిఫిక్ ప్రాంతం, హవాయ్, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో తుపానుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రభావం: ముఖ్యంగా మధ్య, ఉత్తర భారతదేశంలో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. అలాగే మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, దక్షిణ పసిఫిక్, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్ ప్రాంతాల్లో కూడా కరువు ముప్పు కనిపిస్తోంది.
వివరాలు
వాతావరణ నమూనాలు అన్నీ ఒకే దిశగా సంకేతాలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాతావరణ నమూనాలు అన్నీ ఒకే దిశగా సంకేతాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.