brain cancer patients: బ్రెయిన్ క్యాన్సర్ రోగులకు కొవిడ్ టీకాతో సర్‌ప్రైజ్ బెనిఫిట్?
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్-19 టీకాపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా ఉన్న రోగులకు బయాప్సీ లేదా ట్యూమర్ సర్జరీకి 100 రోజుల ముందు కోవిడ్ టీకా తీసుకున్నవారు.. టీకా తీసుకోని వారితో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువ కాలం జీవించినట్లు ఓ ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ అధ్యయనం ఇంకా నిపుణుల సమీక్ష (పీర్ రివ్యూ)కు వెళ్లలేదు. టీకా వల్లే ఆయుష్షు పెరిగిందని అధ్యయనం నిరూపించలేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు జులై 31న medRxivలో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు పరిశీలించిన ఇతర టీకాల్లో మాత్రం ఇలాంటి సంబంధం కనిపించలేదు.
వివరాలు
ఇంకా ఫలితం నిరూపణ కాలేదు
ఈ ఫలితాలు కోవిడ్ టీకా రోగనిరోధక వ్యవస్థలోని క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యాన్ని ఏదో విధంగా ప్రేరేపిస్తుందనే అవకాశాన్ని సూచిస్తున్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా అట్ బర్మింగ్‌హామ్‌కు చెందిన న్యూరోసర్జన్ జేమ్స్ మార్కర్ట్ తెలిపారు.
అయితే తమ అధ్యయనం టీకా తీసుకోవడం, ఎక్కువకాలం జీవించడం మధ్య సంబంధాన్ని మాత్రమే గుర్తించిందని.. కారణం-ఫలితం నిరూపించలేదని ఆయన స్పష్టం చేశారు
వివరాలు
ఇప్పటికే మరిన్ని ఆధారాలు
mRNA కోవిడ్ టీకాలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక చర్యను ప్రేరేపించవచ్చనే ఆధారాలు క్రమంగా పెరుగుతున్నాయని ఫ్లోరిడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ ఎలియాస్ సయూర్ తెలిపారు.
తాజా అధ్యయనంలో ఆయన పాల్గొనలేదు. గతేడాది సయూర్ బృందం కూడా mRNA కోవిడ్ టీకా, కొన్ని రకాల క్యాన్సర్లలో ఎక్కువకాలం జీవించే అవకాశాల మధ్య సంబంధాన్ని గుర్తించింది.
ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా ఉన్న రోగుల్లో ఇమ్యూనోథెరపీకి కొన్ని నెలల ముందు కోవిడ్ టీకా తీసుకున్నవారు.. టీకా తీసుకోని వారితో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువకాలం జీవించినట్లు ఆ పరిశోధనలో తేలింది.
తాజా అధ్యయనం ఈ ఆధారాలను మరింత బలపరుస్తోందని సయూర్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
187 మంది గ్లియోబ్లాస్టోమా రోగులపై అధ్యయనం
జేమ్స్ మార్కర్ట్, ఆయన సహచరులు 2022 నుంచి 2025 మధ్య గ్లియోబ్లాస్టోమా కారణంగా మెదడు ట్యూమర్‌కు బయాప్సీ లేదా శస్త్రచికిత్స చేయించుకున్న 187 మంది రోగుల వివరాలను పరిశీలించారు.
గ్లియోబ్లాస్టోమా అత్యంత దూకుడైన మెదడు క్యాన్సర్. దీనికి ప్రస్తుతం పూర్తిస్థాయి నివారణ లేదు.
సర్జరీకి ముందు కోవిడ్ టీకా తీసుకున్న రోగుల్లో సగం మంది కనీసం 743 రోజులు జీవించారు.
అదే టీకా తీసుకోని రోగుల్లో మధ్యస్థ జీవనకాలం 349 రోజులు మాత్రమే. అంటే గ్లియోబ్లాస్టోమా రోగులకు సగటున మరో ఏడాది జీవితకాలం లభించే అవకాశం ఉన్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
ఇలాంటి రోగనిరోధక చర్యను ప్రేరేపించవచ్చు
అయితే పరిశోధకులు కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత, టీకా తీసుకున్నవారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందాయా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించేందుకు ప్రయత్నించారు.
అయినప్పటికీ అన్ని ప్రభావాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని మార్కర్ట్ తెలిపారు.
అందువల్ల అసలు ఈ తేడాకు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.
కోవిడ్ టీకాలు క్యాన్సర్‌పై పోరాడేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా mRNA ఆధారిత టీకాలు ఇలాంటి రోగనిరోధక చర్యను ప్రేరేపించవచ్చని గతంలోనూ కొన్ని అధ్యయనాలు సూచించాయి.
వివరాలు
రోగనిరోధక వ్యవస్థను మేల్కొలుపుతోందా?
మార్కర్ట్, సయూర్ బృందాల పరిశోధనల్లోనూ ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధులకు ఇచ్చే non-mRNA టీకాలు క్యాన్సర్ రోగుల్లో ఇలాంటి జీవనకాల ప్రయోజనాన్ని చూపించలేదు.
దీంతో mRNA టెక్నాలజీకి ప్రత్యేకమైన పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్లియోబ్లాస్టోమా విషయంలో శస్త్రచికిత్స కూడా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా సర్జరీకి ముందు క్యాన్సర్ మెదడులో దాగి ఉంటుంది. అయితే ట్యూమర్‌ను తొలగించే సమయంలో క్యాన్సర్ కణాల్లోని కొన్ని ప్రోటీన్లు రక్తప్రవాహంలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.
అప్పటికే టీకా ద్వారా ఉత్తేజితమైన రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వివరాలు
క్యాన్సర్‌ను ప్రత్యేకంగా గుర్తిస్తుందా?
కోవిడ్ టీకా రోగనిరోధక వ్యవస్థకు సాధారణంగా 'అలారం' మోగిస్తుందా? లేక గ్లియోబ్లాస్టోమాను ప్రత్యేకంగా గుర్తించేలా శిక్షణ ఇస్తుందా? అన్నది తెలుసుకోవాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
ప్రాథమిక ఆధారాలు రెండో అవకాశాన్ని కూడా సూచిస్తున్నాయి. mRNA కోవిడ్ టీకాలు కరోనా వైరస్‌లోని ఓ ప్రోటీన్ భాగాన్ని గుర్తించేలా రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి.
గ్లియోబ్లాస్టోమా కణాల్లోనూ దానికి ఆకారపరంగా పోలిక ఉన్న ఓ అణువును మార్కర్ట్ బృందం గుర్తించింది.
దీంతో కరోనా వైరస్ ప్రోటీన్‌ను గుర్తించడం నేర్చుకున్న రోగనిరోధక కణాలు.. మెదడు క్యాన్సర్ కణాలను కూడా గుర్తించే అవకాశం ఉందా? అనే అంశంపై పరిశోధన కొనసాగుతోంది.
వివరాలు
తదుపరి దశలో క్లినికల్ ట్రయల్స్
తాజా ఫలితాలను మరో వేరు రోగుల సమూహంలో పరిశీలించి నిర్ధారించేందుకు మార్కర్ట్, ఆయన సహచరులు ప్రయత్నిస్తున్నారు.
ఆ ఫలితాలు అనుకూలంగా వస్తే.. మెదడు క్యాన్సర్ రోగులపై కోవిడ్ టీకా ప్రభావాన్ని నేరుగా పరీక్షించే క్లినికల్ ట్రయల్ నిర్వహించాలనే ఆసక్తి మార్కర్ట్ వ్యక్తం చేశారు.
మరోవైపు సయూర్ బృందం ఇప్పటికే అధునాతన నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ రోగుల్లో ఇమ్యూనోథెరపీ ప్రయోజనాలను mRNAకోవిడ్ టీకా పెంచుతుందా? అనే అంశంపై క్లినికల్ ట్రయల్ ప్రారంభించే దిశగా ముందుకు వెళ్తోంది.
భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో రోగులతో నిర్వహించే ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్ ద్వారా.. విస్తృతంగా అందుబాటులో ఉన్న, తక్కువ ఖర్చుతో కూడిన కోవిడ్ టీకా క్యాన్సర్ రోగుల జీవనకాలాన్ని పెంచుతుందని నిరూపితమైతే అది వైద్యరంగంలో సంచలనాత్మక పరిణామవుతుంది
వివరాలు
ఇప్పుడే నిర్ణయానికి రాలేం
అయితే ప్రస్తుతం కోవిడ్ టీకా క్యాన్సర్ రోగుల ఆయుష్షును పెంచుతుందని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పడం లేదు.
క్యాన్సర్ రోగులు టీకా తీసుకునే వరకు సర్జరీ లేదా ఇతర చికిత్సలను వాయిదా వేయాలని ఎవరూ సూచించడం లేదని మార్కర్ట్‌తో కలిసి పనిచేస్తున్న క్యాన్సర్ పరిశోధకుడు శివకృష్ణ ఉప్పలపాటి స్పష్టం చేశారు.
ప్రస్తుతం లభించిన ఫలితాలు కేవలం ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయని, దీనిపై మరింత లోతైన పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అయితే చికిత్సా అవకాశాలు పరిమితంగా ఉన్న గ్లియోబ్లాస్టోమా వంటి క్యాన్సర్‌లో కొత్త దిశను సూచించే ప్రతి ఆధారం ఆశ కలిగించేదేనని మార్కర్ట్ పేర్కొన్నారు.