AK-203 rifle: ఏకే-203 'షేర్' వచ్చేస్తోంది.. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం ఉపయోగిస్తున్న పాత ఇన్‌సాస్ రైఫిల్స్ స్థానంలో అధునాతన ఏకే-203 రైఫిల్స్ ప్రవేశించనున్నాయి. 'షేర్'గా పిలిచే ఈ రైఫిల్స్‌ను పూర్తిగా స్వదేశీ విడిభాగాలు, ముడిసరుకుతో భారత్‌లోనే తయారు చేస్తున్నారు. తాజాగా తొలి ఏకే-203 'షేర్' రైఫిల్‌ను విజయవంతంగా పరీక్షించారు. భారత్-రష్యా భాగస్వామ్యంతో తయారీ ఏకే-203 'షేర్' రైఫిళ్లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు భారత్, రష్యా కలిసి 2019లో ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్‌ఆర్‌పీఎల్)ను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రైఫిళ్ల తయారీ జరుగుతోంది.
వివరాలు
తొలి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం
ఏకే-203 తయారీకి అవసరమైన ప్రతి విడిభాగం, ముడిసరుకును భారత్‌లోనే సమకూర్చినట్లు ఐఆర్‌ఆర్‌పీఎల్ వెల్లడించింది.
తాజాగా నిర్వహించిన పరీక్షల్లో రైఫిల్‌కు ట్రయల్స్ చేపట్టామని, వాటి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని సంస్థ సీఈవో, ఎండీ మేజర్ జనరల్ కేఎస్ శర్మ తెలిపారు.
పూర్తిగా భారతీయ విడిభాగాలు, ముడిసరుకుతో తయారైన తొలి ఏకే-203 'షేర్' రైఫిల్‌ను విజయవంతంగా పరీక్షించడం తమకు ఎంతో గర్వకారణమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
సెప్టెంబరులో సైనిక పరీక్షలకు..
త్వరలోనే మరిన్ని ఏకే-203 ప్రొటోటైప్‌లను సిద్ధం చేయనున్నట్లు కేఎస్ శర్మ తెలిపారు. వాటిని సెప్టెంబరులో సైనిక పరీక్షల కోసం అప్పగించే అవకాశం ఉందని వెల్లడించారు.
రైఫిళ్ల ఉత్పత్తిని భారీ స్థాయిలో చేపట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్ తయారీ
ఏకే-203 రైఫిళ్లను వేగంగా ఉత్పత్తి చేసేందుకు ఐఆర్‌ఆర్‌పీఎల్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ప్రతి 100 సెకన్లకు ఒక ఏకే-203 రైఫిల్‌ను తయారు చేసే సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.
వివరాలు
ఏకే-203 ప్రత్యేకతలు ఇవే..
ఏకే-203 అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కలాష్నికోవ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన గ్యాస్ ఆపరేటెడ్ 7.62x39 ఎంఎం అసాల్ట్ రైఫిల్.
ఇది నిమిషానికి సుమారు 700 రౌండ్లు కాల్చగలదు. దీని ప్రభావవంతమైన పరిధి సుమారు 800 మీటర్లుగా ఉంది.
ఇన్‌సాస్ స్థానంలో ఏకే-203
భారత సైనికులు ప్రస్తుతం వినియోగిస్తున్న పాత ఇన్‌సాస్ రైఫిళ్ల స్థానంలో ఏకే-203లను ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో భారత్ ఆరు లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్లను సమకూర్చుకోనుంది. దేశీయంగా తయారీ జరగడం వల్ల రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది మరింత ఊతమివ్వనుంది.