Cyber warriors: డిజిటల్ మోసాల నివారణే లక్ష్యం.. రంగంలోకి ఎన్‌సీసీ 'సైబర్ వారియర్స్'
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇటువంటి మోసాలపై అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇంకా చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టే దిశగా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) కీలక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు 10 వేల మంది క్యాడెట్లతో 'సైబర్ వారియర్స్'ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్ట్‌నెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ వెల్లడించారు. ఈ సైబర్ వారియర్స్‌ను జాతీయ స్థాయి డేటాబేస్‌తో అనుసంధానించనున్నట్లు తెలిపారు.
Details
'యువ ఆపద మిత్ర'లో శిక్షణ
అదేవిధంగా ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పందించేందుకు లక్ష మంది క్యాడెట్లకు 'యువ ఆపద మిత్ర'లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీరినీ డేటాబేస్‌తో లింక్ చేయడం ద్వారా, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వారి సేవలను తక్షణమే వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయాలను ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్‌సీసీ డీజీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు హబ్స్‌ను ఏర్పాటు చేసి, అక్కడ ఎంపిక చేసిన క్యాడెట్లకు డ్రోన్, కౌంటర్ డ్రోన్ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరో ప్రత్యేకత చోటుచేసుకోనుంది. ఎన్‌సీసీకి చెందిన పరేడ్ మరియు కంటింజెంట్ కమాండర్లు తొలిసారిగా కత్తులతో మార్చ్ చేయనుండటం విశేషం.