చంద్రయాన్-3 విజయవంతం.. ప్రయోగం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తలు వీరే
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది. అయితే చంద్రయాన్-3 ప్రయోగం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్: లాంచ్ వెహికిల్ సిస్టమ్ ఇంజనీరింగ్ లో నిపుణులైన సోమనాథ్, చంద్రయాన్-3 ని మోసుకెళ్ళే లాంచ్ వెహికిల్ మార్క్ 3 డిజైనింగ్ లో పాలు పంచుకున్నారు. ఇస్రో ఛైర్మన్ కంటే ముందు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపుల్షన్ సిస్టమ్ సెంటర్లకు డైరెక్టర్ గా సోమనాథ్ పనిచేసారు. ఈ రెండు ఏజెన్సీలు ఇస్రో కోసం రాకెట్లను అభివృద్ధి చేస్తున్నాయి.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్
ఐఐటీ మద్రాసు నుండి పట్టభద్రుడైన వీరముత్తువేల్ 2019లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. గత మూడు దశాబ్దాలుగా ఇస్రో కోసం వీరముత్తువేల్ పనిచేస్తున్నారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎమ్ వనిత స్థానంలో వీరముత్తువేల్ వచ్చారు. ఎమ్ వనిత ప్రస్తుతం యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
VSSC డైరెక్టర్ ఉన్ని క్రిష్ణన్ నాయర్
విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్నిక్రిష్ణన్ నాయర్ పనిచేస్తున్నారు. చంద్రయాన్-3 లో నింగిలోకి తీసుకెళ్ళిన ఎల్వీ వీ ఎమ్ -3 రాకెట్ ని VSSC లోనే తయారు చేసారు. ఎన్ శంకరన్ - URSC డైరెక్టర్ ఉపగ్రహాలకు అవసరమయ్యే పవర్ సిస్టమ్ ను తయారు చేసే యూఆర్సీసీ డైరెక్టర్ గా ఎన్ శంకరన్ వ్యవహరిస్తున్నారు. చంద్రుడిపై దిగే ముందు, దిగిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్ చేయాల్సిన బాధ్యతలైన రిమోట్ సెన్సింగ్, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకునే పవర్ సిస్టమ్ తయారు చేయడంలో ఎన్ శంకరన్ కీలకంగా ఉన్నారు.
మరికొంత మంది శాస్త్రవేత్తలు
చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ గా మోహన్ కుమార్ పనిచేసారు. ఇంకా చంద్రయాన్-3 ప్రయోగంలో తనవంతు సహకారాన్ని అందించిన వారిలో రీతూ కారిదల్ ఒకరు. రాకెట్ మహిళగా పిలవబడే రీతూ, మంగళ్ యాన్ మిషన్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసారు. బెంగళూరులోని ISTRAC(ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ సెంటర్ డైరెక్టర్ గా బీఎన్ రామకృష్ణ, చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. అలాగే 54మంది మహిళా శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 ప్రయోగం కోసం అహర్నిశలు శ్రమించారు.