LOADING...
octopus: గాలాపాగోస్‌ సముద్ర గర్భంలో అరుదైన అతిచిన్న ఆక్టోపస్
గాలాపాగోస్‌ సముద్ర గర్భంలో అరుదైన అతిచిన్న ఆక్టోపస్

octopus: గాలాపాగోస్‌ సముద్ర గర్భంలో అరుదైన అతిచిన్న ఆక్టోపస్

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పసిఫిక్‌ మహాసముద్ర గర్భంలో పరిశోధకులు అత్యంత అరుదైన చిన్న ఆక్టోపస్‌ను గుర్తించారు. సాధారణంగా ఆక్టోపస్‌లు ఒక మీటర్‌ పొడవు,తొమ్మిది కిలోల వరకు బరువు పెరుగుతాయి. అయితే ఈ కొత్త జీవి మాత్రం గోల్ఫ్‌ బంతి పరిమాణంలో ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈక్వెడార్‌ తీరానికి సమీపంలోని గాలాపాగోస్‌ దీవుల వద్ద సముద్ర ఉపరితలం నుంచి సుమారు ఆరు వేల అడుగుల లోతులో ఇది కనిపించింది. చిమ్మచీకటి మధ్య సంచరిస్తున్న ఈ జీవిని ప్రత్యేక పరికరాలతో జాగ్రత్తగా వెలికి తీశారు. ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని కొత్త ఆక్టోపస్‌ జాతిగా దీనిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అరుదైన జీవజాలానికి ప్రసిద్ధి చెందిన గాలాపాగోస్‌ దీవుల పరిసరాల్లో భూమిపై మరెక్కడా కనిపించని వెయ్యికి పైగా వృక్ష,జంతు జాతులు ఉన్నాయి.

వివరాలు 

"ఈవీ నాటిలస్‌" అన్వేషణ

ఇప్పుడు ఈ ప్రాంతంలోని లోతైన జలాల్లో మరో కొత్త జీవి ఉనికి బయటపడింది. నీలి రంగులో కనిపిస్తున్న ఈ చిన్న ఆక్టోపస్‌కు "మైక్రోఎలిడోన్‌ గాలాపాగెన్సిస్‌" అనే పేరు పెట్టారు. షికాగోలోని ఫీల్డ్‌ మ్యూజియం, చార్లెస్‌ డార్విన్‌ ఫౌండేషన్‌, గాలాపాగోస్‌ జాతీయ ఉద్యానవన విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు కలిసి 2015 నుంచి ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. "ఈవీ నాటిలస్‌" అనే అన్వేషణ నౌక ద్వారా చేపట్టిన సముద్ర గర్భ యాత్రలో ఈ ఆక్టోపస్‌ తొలిసారిగా కనిపించింది. నౌక నుంచి దూర నియంత్రణతో పనిచేసే నీటి అడుగు యంత్రాన్ని సముద్ర గర్భంలోకి పంపించారు. సముద్ర మట్టానికి 5,800 అడుగుల లోతులో ఉన్న సముద్ర పర్వతం సమీపంలో ఈ జీవిని గుర్తించి, ప్రత్యేక యాంత్రిక పరికరంతో సేకరించారు.

వివరాలు 

3డీ నమూనా

గోల్ఫ్‌ బంతి పరిమాణంలో ఉన్న ఈ నీలి రంగు ఆక్టోపస్‌ ఆకృతి శాస్త్రవేత్తలకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. సాధారణంగా కొత్త జాతిని పూర్తిగా అధ్యయనం చేయాలంటే ఆ జీవిని కోసి అంతర్గత నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అయితే ఈ జాతికి చెందిన జీవి ఒక్కటే దొరకడంతో దానిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మైక్రో సీటీ స్కానింగ్‌తో దాని శరీర అంతర్గత భాగాలను పరిశీలించి, 3డీ నమూనాను రూపొందించారు. అనంతరం దీనిని అధికారికంగా కొత్త ఆక్టోపస్‌ జాతిగా ధ్రువీకరించారు. మన భూమిపై ఇప్పటికీ మానవ కంటికి చిక్కని ఎన్నో జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement