Loading...
TRAI: డేటా లేకుండానే తక్కువ వాలిడిటీ వోచర్లు.. టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు
టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు

TRAI: డేటా లేకుండానే తక్కువ వాలిడిటీ వోచర్లు.. టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తక్కువ ఆదాయం ఉన్న టెలికం వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా రీఛార్జ్‌ చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం వాయిస్‌ కాల్స్‌,ఎస్‌ఎంఎస్‌ సేవలు మాత్రమే అవసరమయ్యే వారికి తక్కువ కాలపరిమితితో ప్రత్యేక టారిఫ్‌ వోచర్లు (ఎస్‌టీవీలు) అందించాలని టెలికం సంస్థలను టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ఆదేశించింది. ఈ మేరకు 'టెలికాం కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ (13వ సవరణ) రెగ్యులేషన్‌-2026'ను మంగళవారం విడుదల చేసింది. 30 రోజుల వాలిడిటీతో మాత్రమే కాకుండా.. అంతకంటే తక్కువ కాలపరిమితితోనూ వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు మాత్రమే ఉండే ఎస్‌టీవీలను టెలికం కంపెనీలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

వివరాలు 

ప్రతి నెల ఒకే తేదీన రీచార్జ్‌ చేసుకునే సదుపాయం

దీనివల్ల డేటా అవసరం లేని వినియోగదారులు తమ ఆర్థిక పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా తక్కువ మొత్తంతో రీఛార్జ్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర సమాచార శాఖ తెలిపింది.

నెలనెలా ఒకే తేదీన రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటును కూడా కంపెనీలు కల్పించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆ తేదీ సంబంధిత నెలలో లేకపోతే.. ఆ నెలలోని చివరి తేదీని రీఛార్జ్‌ తేదీగా పరిగణించాలి.

అదే సమయంలో వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు కలిపి ఉన్న ఎస్‌టీవీలకు ఇచ్చే వాలిడిటీకి అనుగుణంగా కనీసం ఒక ఎక్కువ కాలపరిమితి వోచర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని ట్రాయ్‌ పేర్కొంది.

2024లో తీసుకొచ్చిన 12వ సవరణ తర్వాత వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే అందించే ఎస్‌టీవీలపై ట్రాయ్‌ సమీక్ష చేపట్టింది.

వివరాలు 

ఎక్కువ కాలపరిమితి ఉన్న ఎస్‌టీవీలు కూడా తప్పనిసరి

మార్కెట్‌లో ఇలాంటి రీఛార్జ్‌ ప్లాన్లు పరిమితంగా ఉన్నట్లు గుర్తించింది.

అందుబాటులో ఉన్న వాటిలోనూ ఎక్కువ కాలపరిమితి కలిగిన ప్లాన్లే అధికంగా ఉండటంతో.. తక్కువ వ్యవధికి రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఎంపికలు తగ్గిపోయినట్లు ట్రాయ్‌ తెలిపింది.

వివిధ వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాజా నిబంధనలను ఖరారు చేసినట్లు ట్రాయ్‌ వెల్లడించింది.

ముఖ్యంగా డేటా సేవలు అవసరం లేని వినియోగదారులకు వారి అవసరాలకు సరిపోయేలా మరిన్ని రీఛార్జ్‌ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ADVERTISEMENT