Loading...
Whatsapp: బ్యాకప్‌ లేకుండానే.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా
బ్యాకప్‌ లేకుండానే.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

Whatsapp: బ్యాకప్‌ లేకుండానే.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు చాలామంది పాత ఫోన్‌లోని వాట్సప్‌ చాట్‌లు, ఫొటోలు, వీడియోలను కొత్త ఫోన్‌లోకి తీసుకురావడానికి గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ వంటి క్లౌడ్‌ బ్యాకప్‌ సేవలను ఉపయోగిస్తుంటారు. అయితే.. వాట్సప్‌లోనే నేరుగా డేటాను బదిలీ చేసుకునే సదుపాయం చాలాకాలంగా అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగిస్తే ప్రత్యేకంగా బ్యాకప్‌ తీసుకుని, కొత్త ఫోన్‌లో వాట్సప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి మళ్లీ డేటాను రీస్టోర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో సమయంతో పాటు ఇంటర్నెట్‌ డేటా కూడా ఆదా అవుతుంది. పాత ఫోన్‌లో వాట్సప్‌ను ఓపెన్‌ చేసి Settingsలోకి వెళ్లాలి. అక్కడ Chats ఆప్షన్‌ను ఎంచుకుని Transfer Chatsపై క్లిక్‌ చేయాలి. అనంతరం Start బటన్‌ను నొక్కితే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.

వివరాలు

వాట్సప్‌ డేటా కొత్త ఫోన్‌లోకి బదిలీ..

ఇప్పుడు కొత్త ఫోన్‌లో వాట్సప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి ఓపెన్‌ చేయాలి. టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ను అంగీకరించి.. పాత ఫోన్‌లో ఉపయోగిస్తున్న అదే వాట్సప్‌ నంబర్‌తో కొత్త ఫోన్‌లో లాగిన్‌ అవ్వాలి.

ఓటీపీ ద్వారా నంబర్‌ను వెరిఫై చేసిన తర్వాత స్క్రీన్‌పై డేటా ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

దానిపై క్లిక్‌ చేస్తే కొత్త ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఈ కోడ్‌ను పాత ఫోన్‌లోని వాట్సప్‌ ద్వారా స్కాన్‌ చేయాలి.

ఆ తర్వాత రెండు ఫోన్లను కనెక్ట్‌ చేసేందుకు అడిగే అనుమతులను అంగీకరించాలి.

ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పాత ఫోన్‌లోని చాట్‌లు, ఫొటోలు, వీడియోలు ఇతర వాట్సప్‌ డేటా కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతాయి.

వివరాలు

డేటా పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా చేయండిలా..

డేటా పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యే వరకు రెండు ఫోన్లను పక్కపక్కనే ఉంచి, వాట్సప్‌ను మూసివేయకుండా ఉండటం మంచిది. అలాగే రెండు ఫోన్లలో వైఫై, లొకేషన్‌ ఆన్‌లో ఉండాలి.

అయితే ఈ పద్ధతి ఆండ్రాయిడ్‌ నుంచి ఆండ్రాయిడ్‌కు, ఐఫోన్‌ నుంచి ఐఫోన్‌కు డేటా బదిలీ చేసేటప్పుడు మాత్రమే పనిచేస్తుంది.

ఈ విధానంలో ముఖ్యమైన ప్రయోజనం.. వాట్సప్‌ డేటాను ముందుగా థర్డ్‌ పార్టీ క్లౌడ్‌ సర్వీస్‌లోకి అప్‌లోడ్‌ చేసి, తర్వాత కొత్త ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకపోవడం.

ఇంటర్నెట్‌ డేటా ఆదా అవుతుంది. డేటా నేరుగా ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు బదిలీ కావడంతో సమయం కూడా తగ్గుతుంది.

క్లౌడ్‌ సేవల ప్రమేయం లేకపోవడంతో డేటా బదిలీ ప్రక్రియ మరింత సురక్షితంగా ఉంటుంది.

ADVERTISEMENT