Loading...
Uber: డ్రైవర్ అవసరం లేని ట్యాక్సీలు.. యూరప్‌లో ఉబర్ భారీ విస్తరణ..
డ్రైవర్ అవసరం లేని ట్యాక్సీలు.. యూరప్‌లో ఉబర్ భారీ విస్తరణ..

Uber: డ్రైవర్ అవసరం లేని ట్యాక్సీలు.. యూరప్‌లో ఉబర్ భారీ విస్తరణ..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబర్.. చైనాకు చెందిన ఆటోనమస్ డ్రైవింగ్ కంపెనీ Pony.aiతో కలిసి రోబోట్యాక్సీ సేవలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూరప్‌లోని పలు దేశాల్లో 2,000కు పైగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉబర్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో ఉబర్, Pony.ai కలిసి వాణిజ్య రోబోట్యాక్సీ సేవలను ప్రారంభించాయి. తాజాగా ఈ భాగస్వామ్యాన్ని మరిన్ని యూరప్ నగరాలకు విస్తరించాలని నిర్ణయించాయి.

వివరాలు

మరో నాలుగు యూరప్ నగరాలకు విస్తరణ..

ఉబర్, Pony.ai భాగస్వామ్యం ద్వారా మరో నాలుగు యూరప్ నగరాల్లో రోబోట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నారు.

అయితే ఆ నగరాల పేర్లను కంపెనీలు ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ విస్తరణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై కూడా స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించలేదు.

వాణిజ్య స్థాయిలో రోబోట్యాక్సీ సేవలను అందించేందుకు అవసరమైనంత పెద్ద వాహన సముదాయాన్ని ఏర్పాటు చేయడం ఉబర్ వ్యూహంలో భాగంగా ఈ విస్తరణ చేపడుతోంది.

పెద్ద సంఖ్యలో వాహనాలు అందుబాటులోకి వస్తే మరింత డేటాను సేకరించడంతో పాటు, తమ వాహనాల భద్రతపై నియంత్రణ సంస్థలకు నమ్మకం కల్పించేందుకు, కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఉబర్ భావిస్తోంది.

వివరాలు

Baidu, WeRideతోనూ ఉబర్ భాగస్వామ్యం..

రోబోట్యాక్సీ సేవలను యూరప్‌లో విస్తరించేందుకు ఉబర్ కేవలం Pony.aiతోనే కాకుండా ఇతర చైనా కంపెనీలతోనూ కలిసి పనిచేస్తోంది.

Baiduకు చెందిన Apollo Go, WeRide సంస్థలతో కూడా ఉబర్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.

జూన్‌లో ఉబర్, WeRide కలిసి స్పెయిన్‌లో తొలి రోబోట్యాక్సీ పైలట్ ప్రాజెక్టును ప్రకటించాయి.

ఈ ఏడాది చివర్లో మాడ్రిడ్‌లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ఇదే సమయంలో అబుదాబి, దుబాయ్ నగరాల్లోనూ ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

టోక్యోలోనూ ఈ ఏడాదే రోబోట్యాక్సీ పరీక్షలు..

ఇక జపాన్‌లోనూ ఉబర్ తన రోబోట్యాక్సీ సేవలను పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.

ఉబర్ జపాన్ అనుబంధ సంస్థ స్థానిక ట్యాక్సీ ఆపరేటర్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివర్లో టోక్యోలో రోబోట్యాక్సీలను ప్రయోగాత్మకంగా నడపనున్నారు.

స్వయంచాలక వాహనాలను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రపంచంలోనే ప్రముఖ వేదికగా ఉబర్‌ను తీర్చిదిద్దాలన్న సీఈఓ దారా ఖోస్రోషాహీ లక్ష్యంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ADVERTISEMENT