
Rahul Patil: ఆంత్రోపిక్‌కి కొత్త సీటీఓగా భారతీయ మూలాల ఇంజనీర్.. రాహుల్ పటిల్.. అయన ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్ కంపెనీ ఆంత్రోపిక్ తన కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా భారతీయ మూలాలు కలిగిన రాహుల్ పటిల్‌ను నియమించింది. అంతకుముందు ఆయన ప్రముఖ పేమెంట్ కంపెనీ స్ట్రైప్లో టెక్నికల్ లీడర్‌షిప్ భాద్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు సీటీఓగా ఉన్న శామ్ మెక్‌కాండ్లిష్ ఇకపై చీఫ్ ఆర్కిటెక్ట్ పాత్రలో కొనసాగనున్నారు. ఈ లీడర్‌షిప్ మార్పులు అంత్రోపిక్ ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టీమ్‌ల మధ్య సహకారాన్ని మరింత బలపరిచే ఉద్దేశంతో చేపట్టినవిగా కంపెనీ తెలిపింది.
నాయకత్వ పరివర్తన
ఇంజినీరింగ్ విభాగాలపై పర్యవేక్షణ
కొత్త సీటీఓగా రాహుల్ పటిల్ కంప్యూట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌ఫరెన్స్‌తో పాటు ఇతర ఇంజినీరింగ్ విభాగాలను పర్యవేక్షిస్తారు. మరోవైపు, కొత్త చీఫ్ ఆర్కిటెక్ట్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న మెక్‌కాండ్లిష్ పెద్ద మోడల్‌ల ప్రీ-ట్రైనింగ్, ట్రైనింగ్ పనులపై దృష్టి పెడతారు. ఇద్దరూ నేరుగా అంత్రోపిక్ ప్రెసిడెంట్ డానియెలా అమోడైకి రిపోర్ట్ చేస్తారు. ఓపెన్‌ఏఐ, మెటా వంటి దిగ్గజాలతో పోటీ ఉధృతమవుతున్న సమయంలో ఈ మార్పులు చోటు చేసుకోవడం విశేషం.
మౌలిక సదుపాయాల నైపుణ్యం
టెక్ రంగంలో విశేష అనుభవం
రాహుల్ పటిల్‌కు టెక్నాలజీ రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్ట్రైప్‌లో ఐదేళ్లు పనిచేయడంతో పాటు, ఒరాకిల్లో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లో కూడా కీలక పదవుల్లో పనిచేశారు. పటిల్ అనుభవాన్ని ప్రశంసించిన అమోడై, "రాహుల్‌కి ఎంటర్‌ప్రైజ్‌లకు అవసరమైన నమ్మకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం, విస్తరించడం వంటి విషయాల్లో నిరూపిత అనుభవం ఉంది" అని పేర్కొన్నారు.
AI అభివృద్ధి
క్లాడ్ స్థానం బలపరచడమే లక్ష్యం
ఈ కీలక సమయంలో అంత్రోపిక్‌లో చేరడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన రాహుల్ పటిల్, "ఎంటర్‌ప్రైజ్ రంగంలో క్లాడ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడంలో ఇది నాకు గొప్ప అవకాశం" అని అన్నారు. అలాగే అంత్రోపిక్ చేస్తున్న పరిశోధనలు, AI సేఫ్టీ పట్ల ఉన్న కట్టుబాట్లు తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని, "ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేయగల అత్యంత ముఖ్యమైన పని ఇదే" అని వ్యాఖ్యానించారు.
నేపథ్యం
విద్యా ప్రస్థానం
లింక్డ్‌ఇన్ వివరాల ప్రకారం, రాహుల్ పటిల్ 1998-2002 మధ్య కర్ణాటకలోని PESIT నుంచి బి.ఇ పూర్తి చేశారు. అనంతరం 2003-2004లో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్ (కంప్యూటర్ సైన్స్), 2011-2013 మధ్య వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. అయితే, ఆయన స్కూలింగ్ లేదా బాల్య జీవితం గురించి పబ్లిక్‌గా ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.