LOADING...
Phone to PC: ఏఐ ప్రభావం: ర్యామ్‌ ఖరీదుతో టెక్‌ పరికరాల ధరలు పెరుగుతాయా?
ఏఐ ప్రభావం: ర్యామ్‌ ఖరీదుతో టెక్‌ పరికరాల ధరలు పెరుగుతాయా?

Phone to PC: ఏఐ ప్రభావం: ర్యామ్‌ ఖరీదుతో టెక్‌ పరికరాల ధరలు పెరుగుతాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన రోజువారీ జీవితంలో ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, పీసీ వంటి పరికరాల ధరలు 2026లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ర్యామ్‌ (RAM) ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడమే. ఒకప్పుడు చాలా తక్కువ ఖర్చుతో దొరికే ఈ కంప్యూటర్‌ భాగం, 2025 అక్టోబర్‌ తర్వాత రెండింతలకుపైగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు మాత్రమే కాదు... వైద్య పరికరాలు వంటి అనేక ఆధునిక యంత్రాల్లో కూడా ర్యామ్‌ కీలకంగా ఉంటుంది. అయితే, ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత డేటా సెంటర్ల సంఖ్య భారీగా పెరగడంతో ర్యామ్‌పై డిమాండ్‌ ఒక్కసారిగా ఎగబాకింది. సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్‌ ఎక్కువ కావడంతో ధరలు పెరిగిపోతున్నాయి.

వివరాలు 

500 శాతం ఎక్కువగా..

సాధారణంగా తయారీదారులు చిన్న ఖర్చు పెరుగుదలను తాము భరిస్తారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలు చిన్నవి కావు. "కొన్ని నెలల క్రితం ధరలతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 500 శాతం ఎక్కువగా కోట్‌ చేస్తున్నారు," అని కంప్యూటర్లు తయారు చేసే CyberPowerPC సంస్థ జనరల్‌ మేనేజర్‌ స్టీవ్‌ మేసన్‌ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఆయన తెలిపారు. ర్యామ్‌ లేదా స్టోరేజ్‌ వాడే ఏ పరికరం అయినా ధర పెరిగే అవకాశం ఉందని మేసన్‌ హెచ్చరించారు. "తయారీదారులకే కాదు, వినియోగదారులకూ ఎంపికలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది," అన్నారు. ర్యామ్‌ అంటే ర్యాండమ్‌ యాక్సెస్‌ మెమరీ. పరికరం పనిచేసేటప్పుడు అవసరమైన కోడ్‌ను తాత్కాలికంగా నిల్వ చేసే భాగం ఇదే.

వివరాలు 

ర్యామ్‌ తయారీదారులపై ప్రభావం ఒకేలా లేదు 

దాదాపు ప్రతి కంప్యూటర్‌లో ఇది కీలకం. ర్యామ్‌ లేకపోతే మీరు ఈ వార్త కూడా చదవలేరు. ఇంత విస్తృతంగా వాడే భాగం కావడంతో, 2026లో కూడా ధరలు తగ్గే సూచనలు లేవని PCSpecialist సంస్థకు చెందిన డ్యానీ విలియమ్స్‌ చెప్పారు. "2025లో మార్కెట్‌ బాగా బూమ్‌లో ఉంది. ర్యామ్‌ ధరలు కొంతైనా తగ్గకపోతే, 2026లో వినియోగదారుల డిమాండ్‌ తగ్గే అవకాశముంది," అని ఆయన అన్నారు. అయితే అన్ని ర్యామ్‌ తయారీదారులపై ప్రభావం ఒకేలా లేదని కూడా చెప్పారు. కొందరి దగ్గర ఎక్కువగా స్టాక్‌ ఉండటంతో వారి ధరలు 1.5 రెట్లు నుంచి 2 రెట్లు మాత్రమే పెరిగాయి. కానీ మరికొందరికి సరైన నిల్వ లేకపోవడంతో ధరలు ఐదు రెట్లు వరకు పెరిగాయని తెలిపారు.

Advertisement

వివరాలు 

ఏఐ ప్రభావంతో పెరుగుతున్న ధరలు

'చిప్‌ వార్‌' పుస్తక రచయిత క్రిస్‌ మిల్లర్‌ మాట్లాడుతూ, ర్యామ్‌ డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణం ఏఐనే అని అన్నారు. "ఏఐకి అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్‌ మెమరీ కోసం డిమాండ్‌ భారీగా పెరిగింది. దాంతో అన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు ఎగబాకుతున్నాయి," అన్నారు. టెక్‌ ఇన్‌సైట్స్‌కు చెందిన మైక్‌ హోవార్డ్‌ మాట్లాడుతూ, అమెజాన్‌, గూగుల్‌ వంటి క్లౌడ్‌ సేవల సంస్థలు 2026-27 అవసరాలను ముందుగానే ఖరారు చేసుకోవడం వల్ల ర్యామ్‌ తయారీదారులకు డిమాండ్‌ స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. "సరఫరా ఈ స్థాయిలో ఉండదని అర్థమవడంతో, తయారీదారులు ధరలను దూకుడుగా పెంచుతున్నారు," అన్నారు.

Advertisement

వివరాలు 

ఏఐ ప్రభావంతో పెరుగుతున్న ధరలు

కొన్ని కంపెనీలు భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయన్న నమ్మకంతో ఇప్పుడే ధర కోట్‌లు ఇవ్వడం కూడా ఆపేశాయని తెలిపారు. ఇది చాలా అరుదైన పరిణామమని చెప్పారు. పీసీల్లో సాధారణంగా మొత్తం ఖర్చులో 15 నుంచి 20 శాతం వరకు ర్యామ్‌ ఖర్చు ఉంటుంది. కానీ ఇప్పుడు అది 30 నుంచి 40 శాతం వరకు చేరుతోందని హోవార్డ్‌ వెల్లడించారు. ఇంత భారాన్ని వినియోగదారులపై వేయక తప్పదని చెప్పారు.

వివరాలు 

2026లో వినియోగదారుల పరిస్థితి ఇదే..

ధరలు ఇలా పెరుగుతుండటంతో, వినియోగదారులు ఎక్కువ డబ్బు పెట్టాలా... లేక తక్కువ సామర్థ్యం ఉన్న పరికరాలతో సరిపెట్టుకోవాలా అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. "2026 నుంచి 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ధరలు, సరఫరా సమస్యలు కొనసాగుతాయన్నదే మా అంచనా," అని మేసన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, కొన్ని పెద్ద కంపెనీలు వినియోగదారుల మార్కెట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ర్యామ్‌ మార్కెట్‌లో ఒకప్పుడు కీలకమైన మైక్రాన్‌ సంస్థ, డిసెంబరులో తన 'క్రూషియల్‌' బ్రాండ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇక పూర్తిగా ఏఐ డిమాండ్‌పైనే దృష్టి పెట్టనుంది. దీంతో వినియోగదారులకు ఎంపికలు తగ్గుతాయని మేసన్‌ అన్నారు. అయితే మరోవైపు, ఇతర కంపెనీలకు సామర్థ్యం పెరిగే అవకాశం ఉండటంతో కొంత సమతుల్యత రావచ్చని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

2026లో వినియోగదారుల పరిస్థితి ఇదే..

హోవార్డ్‌ అంచనా ప్రకారం, 16జీబీ ర్యామ్‌ ఉన్న ఒక సాధారణ ల్యాప్‌టాప్‌ తయారీ ఖర్చు 2026లో 40 నుంచి 50 డాలర్లు (రూ. 3 వేల వరకు) పెరగొచ్చు. ఇది నేరుగా వినియోగదారులపై పడే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చు కూడా సుమారు 30 డాలర్లు పెరిగే సూచనలు ఉన్నాయి. కంప్యూటర్లు ఇప్పుడు లగ్జరీ కాదు, రోజువారీ అవసరం. ర్యామ్‌ ధరలు పెరిగితే, కావాల్సిన పనితీరు కోసం ఎక్కువ ధర చెల్లించాలా, లేక తక్కువ పనితీరు ఉన్న పరికరంతో సరిపెట్టుకోవాలా అన్నది వినియోగదారులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కొంతకాలం పాత టెక్నాలజీతోనే కొనసాగాల్సి రావచ్చని డ్యానీ విలియమ్స్‌ తెలిపారు.

Advertisement