షార్జా గ్రౌండ్‌లో సచిన్ కు అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లకు వేదికగా నిలిచిన షార్జా మైదానంలోని వెస్ట్ స్టాండ్స్ కు సచిన్ పేరు పెట్టారు. ఈ స్టాండ్ కు పేరు పెట్టేందుకు నిన్న సచిన్ 50వ పుట్టిన రోజు వేడుకులను ఆ మైదానంలో నిర్వహించారు. ఈ మేరకు షార్జా స్టేడియం సీఈఓ ఖలాఫ్ బుకాతిర్ సచిన్ స్టాండ్ ను ఆవిష్కరించారు. అయితే సచిన్ ఈ గ్రౌండ్ లో ఎన్నో మరిచిపోలేని ఇన్నింగ్స్ లను ఆడాడు. 1998లో సచిన్ టెండుల్కర్ ఇదే గ్రౌండ్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను బాదాడు. ఈ సెంచరీలు సాధించి 25ఏళ్ళు పూర్తి కావడం విశేషం.
కృతజ్ఞతలు తెలియజేసిన సచిన్
1998 కోకకోలా కప్‌లో భాగంగా ఏప్రిల్ 22న సచిన్ 143 పరుగులు చేయగా.. ఆ తర్వాత రెండు రోజులకు ఫైనల్స్ లో 134 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లు క్రికెట్ పుస్తకాల్లో 'ఇసుక తుఫాన్లు'గా ప్రసిద్ధి చెందాయి. షార్జా గ్రౌండ్ లో సచిన్ ఏడు వన్డే సెంచరీలను చేశాడు. ఈ మైదానంలో స్టాండ్ కు తన పేరు పెట్టడంపై సచిన్ స్పందించాడు. షార్జాలో ఆడటం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుందని, భారత, ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు షార్జా ఎప్పటికీ ప్రత్యేకమైందని, డిజర్ట్‌స్ట్రామ్ ఇన్నింగ్స్ 25వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటంపై బుఖాతీర్, ఆయన బృందానికి సచిన్ కృతజ్ఞతలు తెలియజేశారు.