LOADING...
T20 World Cup: చిన్న కప్పు.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ
చిన్న కప్పు.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ

T20 World Cup: చిన్న కప్పు.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పుష్కర కాలం పాటు ప్రతిసారీ కలిసి బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఈసారి టీ20 ప్రపంచకప్‌లో లేరు. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగే అవకాశమూ కనిపించడం లేదు. ఎప్పుడూ ప్రపంచకప్‌లో కనిపించే బంగ్లాదేశ్‌ ఈసారి అనూహ్యంగా టోర్నీకి దూరమైంది. ఇవన్నీ ఆసక్తిని కొంత మేర తగ్గించే అంశాలే. అయితే సొంతగడ్డపై ధనాధన్‌ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ జరుగుతుంటే క్రికెట్‌ అభిమానులు దూరంగా ఉండగలరా? మెరుపుల ఆటలో ఎవరు ఆడితేనేం.. వినోదానికి కొదవలేదు. దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ టీమ్‌ఇండియాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌.. మూడో ట్రోఫీతో చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో పొట్టి కప్పులో అడుగుపెడుతోంది.

Details

2024లో టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్

ఆతిథ్య దేశానికి దీటుగా మరికొన్ని జట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. వచ్చే నెల రోజుల పాటు క్రికెట్‌ అభిమానులకు పండగే కానుంది. ముంబయి క్రికెట్‌ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన టీ20 ప్రపంచకప్‌ రెండేళ్లు తిరక్కుండానే మళ్లీ వచ్చేసింది. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆ విజయం అనంతరం రోహిత్‌, విరాట్‌ కోహ్లి టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో భారత్‌ మరోసారి భారీ అంచనాలతో కప్పు వేటకు సిద్ధమైంది. గత జట్టులోని అనుభవజ్ఞులు సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య, జస్‌ప్రీత్‌ బుమ్రా ఈసారి కూడా కీలక పాత్ర పోషించనున్నారు.

Details

తిలక్ వర్మపై భారీ అంచనాలు

2024 ప్రపంచకప్‌లో ఆడిన అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా మళ్లీ బరిలోకి దిగుతున్నారు. తొలి బంతి నుంచే దూకుడు ఆటకు ప్రసిద్ధుడైన యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఈ జట్టులో కొత్త సూపర్‌స్టార్‌గా అవతరించాడు. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ కీలక ఆటగాడిగా ఎదగడంతో అతనిపైనా భారీ అంచనాలున్నాయి. కివీస్‌తో సిరీస్‌లో సంజు శాంసన్‌ విఫలమైన నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. ఆ తర్వాత సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌లతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ భీకరంగా కనిపిస్తోంది.

Advertisement

Details

పటిష్టంగా బౌలింగ్

అయితే బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉన్నా.. బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి మాత్రమే భారత్‌ కప్పు గెలుస్తుందా లేదా అన్నది తేలనుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లపై ఇటీవల బుమ్రా సహా భారత బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే సాగింది. ప్రపంచకప్‌లోనూ వికెట్లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌, హార్దిక్‌, దూబె.. స్పిన్నర్లు అక్షర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు ఎంతవరకు కళ్లెం వేస్తారన్నదే కీలకం. తుది జట్టులో అక్షర్‌తో పాటు వరుణ్‌, కుల్‌దీప్‌ల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. తిరుగులేని బ్యాటింగ్‌ బలం, స్వదేశంలో సొంత అభిమానుల మధ్య ఆడటం భారత్‌ను టోర్నీలో బలమైన ఫేవరెట్‌గా నిలబెట్టే అంశాలు.

Advertisement

Details

ఘనారంభమేనా?

అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అవీ కప్పుపై కన్నేశాయి. భారత్‌ ఉన్న గ్రూప్‌-ఎలో పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియా ఉన్నాయి. ఈ గ్రూప్‌లో అగ్రస్థానం సాధించడం భారత్‌కు లాంఛనమే కావచ్చని అంచనా. శనివారం ఉదయం కొలంబోలో పాకిస్థాన్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతుంది. అనంతరం గ్రూప్‌-సిలో వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌ తలపడతాయి. రాత్రి అమెరికాతో మ్యాచ్‌తో టీమ్‌ఇండియా కప్పు వేటను ప్రారంభిస్తుంది. భారత సంతతికి చెందిన కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌, సౌరభ్‌ నేత్రావల్కర్‌, మిలింద్‌ కుమార్‌, సంజయ్‌ కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్‌ లాంటి ప్రతిభావంతులు యుఎస్‌ఏ జట్టులో ఉన్నప్పటికీ.. టీమ్‌ఇండియా ధాటికి వారు నిలుస్తారా అన్నది అనుమానమే.

Details

హర్షిత్‌కు గాయం.. సిరాజ్‌కు చోటు

ఇది జరగబోయే పదో టీ20 ప్రపంచకప్‌. 2007లో తొలి పొట్టి కప్పును ధోని సేన గెలుచుకోగా.. 2024లో రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయంతో టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. వార్మప్‌ మ్యాచ్‌లో గాయపడిన అతడు త్వరగా కోలుకునే అవకాశంలేకపోవడంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేసింది. ఈ మార్పునకు ఐసీసీ అనుమతి ఇచ్చింది.

Details

భారత సంతతి ఆటగాళ్లు - 40

ఈ ప్రపంచకప్‌లో ఇతర దేశాల తరఫున బరిలో దిగుతున్న భారత సంతతి ఆటగాళ్ల సంఖ్య 40. అత్యధికంగా కెనడా జట్టులో 11 మంది ఉన్నారు. అమెరికా (9), ఒమన్‌ (7), యూఏఈ (7), న్యూజిలాండ్‌ (2), దక్షిణాఫ్రికా (1), వెస్టిండీస్‌ (1), ఇటలీ (1), నెదర్లాండ్స్‌ (1) జట్లకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కెనడా, అమెరికా, ఒమన్‌ జట్లకు భారత సంతతి ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉండటం విశేషం.

Details

టోర్నీ వివరాలు

మొత్తం జట్లు: 20 గ్రూప్‌-ఎ: భారత్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌, అమెరికా గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే గ్రూప్‌-సి: ఇంగ్లాండ్‌, ఇటలీ, నేపాల్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌ గ్రూప్‌-డి: అఫ్గానిస్థాన్‌, కెనడా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, యూఏఈ ఫార్మాట్‌ నాలుగు గ్రూప్‌లుగా విభజించిన 20 జట్లు లీగ్‌ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్‌ బహిష్కరించడంతో టీమ్‌ఇండియాకు టోర్నీలో దిగకుండానే రెండు పాయింట్లు లభించాయి. నాకౌట్‌ దశలో మళ్లీ భారత్‌తో ఆడాల్సి వస్తే పాక్‌ బరిలో దిగుతుందా లేదా అన్నది ఆసక్తికరం.

Details

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్

ఫిబ్రవరి 7: భారత్‌ × అమెరికా - వాంఖడే ఫిబ్రవరి 12: భారత్‌ × నమీబియా - దిల్లీ ఫిబ్రవరి 18: భారత్‌ × నెదర్లాండ్స్‌ - అహ్మదాబాద్‌ భారత్‌ మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 20 మినహా లీగ్‌ దశలో ప్రతి రోజూ మూడేసి మ్యాచ్‌లు జరుగుతాయి.

Advertisement