Loading...
Kimi Antonelli: 19 ఏళ్లకే ప్రపంచ విజేత.. దిగ్గజాలను వెనక్కినెట్టి దూసుకొచ్చిన ఆంటోనెలి!
19 ఏళ్లకే ప్రపంచ విజేత.. దిగ్గజాలను వెనక్కినెట్టి దూసుకొచ్చిన ఆంటోనెలి!

Kimi Antonelli: 19 ఏళ్లకే ప్రపంచ విజేత.. దిగ్గజాలను వెనక్కినెట్టి దూసుకొచ్చిన ఆంటోనెలి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్ములా వన్‌ (F1)..చూడటానికి ఎంతో ఆసక్తికరంగా, సరదాగా కనిపించే ఈ ఆటలో పోటీ పడటం మాత్రం అంత సులభం కాదు. అత్యంత వేగంతో దూసుకెళ్లే కార్లను నియంత్రిస్తూ, ప్రత్యర్థులను అధిగమించాలంటే అసాధారణ ప్రతిభ, ధైర్యం, ఏకాగ్రత అవసరం. అలాంటి కఠినమైన క్రీడలోకి గత ఏడాదే అడుగుపెట్టిన 20 ఏళ్ల ఇటలీ యువ రేసర్‌ కిమి ఆంటోనెలి ఇప్పుడు సంచలనంగా మారాడు. ఆరంభంలో అతడిపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. దిగ్గజ డ్రైవర్లు, ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ రేసర్లను వెనక్కినెట్టి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ ఏడాది 19 ఏళ్ల వయసులోనే చైనీస్ గ్రాండ్‌ప్రి (GP)విజేతగా నిలిచి, ఫార్ములా వన్‌ చరిత్రలో రేసు గెలిచిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

వివరాలు

రేసింగ్‌ కుటుంబం నుంచి వచ్చిన ఆంటోనెలి

అక్కడితో ఆగకుండా సీజన్‌ మొత్తం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుని ఎఫ్‌-1 డ్రైవర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు.

ఇంత చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి రేసింగ్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.

కిమి ఆంటోనెలిది రేసింగ్‌ నేపథ్యమున్న కుటుంబం. అతడి తండ్రి మార్కో కూడా రేసింగ్‌ డ్రైవరే. ఫార్ములా వన్‌లో పోటీపడకపోయినా.. అనేక కార్‌ రేసుల్లో పాల్గొని విజయాలు సాధించాడు.

చిన్నప్పటి నుంచి తండ్రి రేసింగ్‌ పోటీలను చూస్తూ పెరిగిన ఆంటోనెలికి కూడా ఈ క్రీడపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

2014లో జర్మన్‌ గ్రాండ్‌ప్రి జరగడానికి ముందు ఓ రేసులో మార్కోకు పాల్గొనే అవకాశం వచ్చింది.

వివరాలు

రేసింగ్‌పై ఎక్కువ మక్కువ

అప్పటికి ఏడేళ్ల వయసున్న ఆంటోనెలి కూడా తండ్రితో కలిసి వెళ్లాలని అనుకున్నాడు. ఫార్ములా వన్‌ రేసును ప్రత్యక్షంగా చూడాలన్నది అతడి కోరిక.

అయితే చిన్నవాడైనందున మార్కోతో కలిసి రేసింగ్‌ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతి లభించలేదు.

అయినప్పటికీ ఆంటోనెలి వెనక్కి తగ్గలేదు. టైర్లతో కూడిన ట్రాలీలో దాక్కుని ఎఫ్‌-1 రేసు జరిగే ప్రాంగణంలోకి వెళ్లాడు. రేసింగ్‌పై అతడికి ఉన్న మక్కువ ఎలాంటిదో చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటే చాలు.

అయితే చిన్నతనంలో ఆంటోనెలికి రేసింగ్‌పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. అతడు ఫుట్‌బాల్‌ ఆడాలని తండ్రి మార్కో కోరుకున్నాడు.

కానీ ఆంటోనెలి మాత్రం తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. 2014లోనే కార్టింగ్‌లోకి ప్రవేశించాడు. మినీ క్లాస్‌ విభాగంలో అద్భుత ప్రదర్శనతో పలు టైటిళ్లు గెలుచుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

మెర్సీడెజ్‌ జూనియర్‌ జట్టులో చోటు.. వరుస విజయాలు!

2017లో ఇటాలియన్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు.

ఆంటోనెలిలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన మెర్సీడెజ్‌ జట్టు 2018లో అతడిని తమ జూనియర్‌ జట్టులోకి తీసుకుంది.

అక్కడి నుంచి అతడి కెరీర్‌ మరింత వేగంగా ముందుకు సాగింది. 2019లో అండర్‌-15 కేటగిరీలో పోటీపడి ఏకంగా ఆరు అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకున్నాడు.

2020లో తనకంటే ఎక్కువ వయసున్న రేసర్లు పోటీపడే విభాగాల్లోనూ సత్తా చాటాడు. అదే ఏడాది ఈ ఇటలీ యువ రేసర్‌కు 'రూకీ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డు లభించింది.

ADVERTISEMENT

వివరాలు

అరంగేట్రం సీజన్‌లో నిరాశ.. రెండో ఏడాది అద్భుత ప్రదర్శన!

2025 మార్చిలో ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి ద్వారా కిమి ఆంటోనెలి ఫార్ములా వన్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే, తొలి సీజన్‌ అతడికి ఆశించిన స్థాయిలో సాగలేదు.

2025 సీజన్‌లో మొత్తం 25 రేసుల్లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ తన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మరింత మెరుగైన డ్రైవర్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాడు.

ఆ కష్టానికి 2026 సీజన్‌లో ఫలితం దక్కింది. మార్చిలో జరిగిన చైనీస్‌ గ్రాండ్‌ప్రిలో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

19 ఏళ్ల 168 రోజుల వయసులో ఎఫ్‌-1రేసును గెలిచిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

ఆ తర్వాత జపనీస్‌, మియామి, కెనడియన్‌, మొనాకో, బెల్జియన్‌, ఇటాలియన్‌, స్పానిష్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ప్రిల్లోనూ విజయాలు సాధించాడు.

వివరాలు

దిగ్గజాలకే గట్టి పోటీ.. ఆంటోనెలి విజయ రహస్యమిదే!

మొత్తంగా ఈ సీజన్‌లో 19 రేసుల్లో పాల్గొని 16 సార్లు పోడియంపై నిలిచాడు. ఏడు పోల్స్‌ పొజిషన్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ప్రదర్శనతో ఫార్ములా వన్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సీజన్‌లో ఆంటోనెలికి గట్టి పోటీ ఎదురైంది.

అతడి మెర్సీడెజ్‌ సహచరుడు జార్జ్‌ రసెల్‌, మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌తో పాటు రెడ్‌బుల్‌ దిగ్గజం మాక్స్‌ వెర్‌స్టాపెన్‌, ఫెరారీ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ వంటి అనుభవజ్ఞులైన రేసర్లు బరిలో నిలిచారు.

అయినప్పటికీ ఆంటోనెలి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. దూకుడుగా డ్రైవింగ్‌ చేయడం ఆంటోనెలి ప్రత్యేకత.

వివరాలు

తొలి ఆరు రేసుల్లో ఐదింట్లో గెలుపు

ముఖ్యంగా కారుపై అతడికి ఉన్న నియంత్రణ అద్భుతమని చెప్పొచ్చు. ఈ ఏడాది ఫార్ములా వన్‌లో కొత్త సాంకేతికతతో రూపొందించిన కార్లపై ఇతర రేసర్ల కంటే ఆంటోనెలి ఎక్కువ పట్టు సాధించగలిగాడు.

సీజన్‌ తొలి ఆరు రేసుల్లో ఐదింటిని గెలుచుకోవడం అతడి ఆధిపత్యానికి నిదర్శనం.

ఇంత చిన్న వయసులోనే దిగ్గజ రేసర్లకు గట్టి పోటీ ఇస్తూ ఫార్ములా వన్‌లో చరిత్ర సృష్టించిన ఆంటోనెలి.. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రాబోయే రోజుల్లో ఎఫ్‌-1లో అతడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

ADVERTISEMENT