LOADING...
T20 WC 2026: మరోసారి ఇండో-పాక్‌ పోరు..? అభిమానుల కల నెరవేరుతుందా!
మరోసారి ఇండో-పాక్‌ పోరు..? అభిమానుల కల నెరవేరుతుందా!

T20 WC 2026: మరోసారి ఇండో-పాక్‌ పోరు..? అభిమానుల కల నెరవేరుతుందా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026 సెమీఫైనల్‌కు చేరే జట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. గ్రూప్‌-1 నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌-4కు అర్హత సాధించింది. రెండో స్థానానికి భారత్‌, వెస్టిండీస్‌ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఇక గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ పోటీ పడుతున్నాయి. సెమీస్‌ బెర్త్‌లపై క్లారిటీ రావడంతో అభిమానుల దృష్టి ఇప్పుడు మ్యాచ్‌ కాంబినేషన్లపై పడింది. ఫిబ్రవరి 26న జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్‌ గ్రూప్‌-1లో విండీస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. గ్రూప్‌-2లో అయితే రెండో బెర్త్‌ దాదాపు న్యూజిలాండ్‌కే ఖాయం అయినట్టే కనిపిస్తున్నా.. పాక్‌ అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం.

Details

జింబాబ్వేపై గెలుపుతో సెమీస్‌ అవకాశాలు

భారత అభిమానుల ఆశ మాత్రం మరోసారి భారత్‌-పాక్‌ పోరు చూడాలన్నదే. ఈ ప్రపంచకప్‌లోనే సెమీస్‌లో ఇరు జట్లు తలపడాలని వారు కోరుకుంటున్నారు. ఇది కష్టమైన సమీకరణమే అయినా అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అసాధారణ ఫలితాలు వస్తే సెమీస్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగడం సాధ్యమే. ముందుగా భారత్‌ పరిస్థితిని పరిశీలిస్తే.. జింబాబ్వేపై గెలుపుతో సెమీస్‌ అవకాశాలు మెరుగయ్యాయి. తదుపరి మ్యాచ్‌లో విండీస్‌పై గెలిస్తే భారత్‌ సెమీస్‌కు చేరుతుంది. ఓడినా లేదా మ్యాచ్‌ రద్దైనా మెరుగైన రన్‌రేట్‌ కారణంగా విండీస్‌కే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది. అయితే సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కోవాలంటే భారత్‌ విండీస్‌పై సాధారణ విజయం సాధిస్తే సరిపోదు. భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకోవాలి.

Details

పాకిస్తాన్‌ గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలవాలి

అదే సమయంలో గ్రూప్‌-1 టేబుల్‌ టాపర్‌గా ఉన్న దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోరంగా ఓడిపోవాలి. అలా జరిగితే భారత్‌, దక్షిణాఫ్రికా రెండూ నాలుగు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్‌ ఆధారంగా స్థానాలు నిర్ణయించబడతాయి. విండీస్‌పై భారీ విజయంతో భారత్‌ రన్‌రేట్‌ పెరుగుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా భారీ ఓటమి చవిచూస్తే వారి రన్‌రేట్‌ తగ్గిపోతుంది. అప్పుడు గ్రూప్‌-1లో భారత్‌ అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలుస్తాయి. నిబంధనల ప్రకారం గ్రూప్‌-1టాపర్‌ గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్‌లో తలపడుతుంది. అందువల్ల భారత్‌-పాక్‌ సెమీస్‌ కావాలంటే పాకిస్తాన్‌ గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలవాలి. పాక్‌కు టాప్‌ స్థానానికి అవకాశాలు లేవు. కాబట్టి భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో ఉండటం తప్పనిసరి.

Advertisement

Details

శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి

ఇక పాక్‌ పరిస్థితి చూస్తే.. ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీస్‌ చేరింది. పాక్‌ తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలిచి రన్‌రేట్‌ పెంచుకోవాలి. అలా చేస్తే పాక్‌ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌ కూడా మూడు పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉంది. న్యూజిలాండ్‌ తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో సాధారణంగా ఓడినా రెండో స్థానంలోనే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. కానీ భారత్‌-పాక్‌ సెమీస్‌ జరగాలంటే ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ గణనీయంగా పడిపోతుంది.

Advertisement

Details

పాక్‌ సెమీస్‌ చేరాలంటే అద్భుతాలు జరగాలి

ఇదే సమయంలో శ్రీలంకపై భారీ విజయం సాధించిన పాక్‌ మెరుగైన రన్‌రేట్‌తో గ్రూప్‌-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు గ్రూప్‌-1 టాపర్‌గా భారత్‌, గ్రూప్‌-2 రన్నరప్‌గా పాకిస్తాన్‌ సెమీఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. లెక్కల ప్రకారం ఇది సాధ్యమే అయినా, వాస్తవంగా ఈ సమీకరణాలు నెరవేరడం చాలా కష్టసాధ్యం. భారత్‌ గ్రూప్‌-1లో టాప్‌ స్థానం సాధించడం సాధ్యమే అనిపించినా.. పాక్‌ సెమీస్‌ చేరేందుకు మాత్రం అద్భుత ఫలితాలే అవసరం.

Advertisement