IND vs PAK: క్రికెట్ యుద్ధానికి సిద్ధమా?.. దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిలిచిపోయే క్షణాలు వచ్చేశాయి. దేశం, ప్రాంతం అనే తేడా లేకుండా క్రికెట్ ఉన్న ప్రతి చోటా తెరలన్నీ భారత్-పాకిస్థాన్ సమరంతో నిండిపోనున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్‌లలో అయితే సాయంత్రం నుంచి వీధులే నిశ్శబ్దంగా మారినా ఆశ్చర్యం లేదు. ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లే చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఇంకొన్ని గంటలే మిగిలాయి. గతేడాది పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తొలిసారి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్‌పై ఎప్పుడూ అదిరిపోయే ప్రదర్శన చేసే టీమ్‌ఇండియా తన ఘన రికార్డును కొనసాగించాలని చూస్తుంటే, ఇటీవలి ఫామ్‌ను నిలబెట్టుకుని భారత్‌కు గట్టి షాక్ ఇవ్వాలని పాక్ సిద్ధమవుతోంది.
Details
కొలంబో వేదికగా గ్రూప్-ఎ క్లాష్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్ ఆదివారం తలపడనున్నాయి. నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోవడంతో, ఈ టోర్నీలో తన మ్యాచ్‌లను పాక్ కొలంబోలో ఆడుతోంది. ఇప్పటికే అక్కడ రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో పాక్ ఉంది. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో విజయాన్ని సాధించాలని భారత్ భావిస్తోంది. కొన్ని నెలల క్రితం ఆసియా కప్‌లో మూడు సార్లు తలపడగా టీమ్‌ఇండియా గెలిచింది. అందువల్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయినా ఇటీవల మెరుగ్గా ఆడుతున్న పాక్‌ను తేలికగా తీసుకోవడం ప్రమాదమే.
Details
అభిషేక్ ఆడతాడా?
ప్రస్తుత భారత జట్టులో అతి పెద్ద స్టార్‌గా ఎదిగిన అభిషేక్ శర్మ పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా అన్నదే ప్రధాన చర్చ. కడుపు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రి పాలై నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అతడు కోలుకుని ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్లు సమాచారం. విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ జట్టులో సమస్యలేమీ లేవన్నాడు. కాబట్టి అభిషేక్ ఆడే అవకాశాలే ఎక్కువ. అతడు ఆడితే సంజు శాంసన్ డగౌట్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆసియా కప్‌లో చెలరేగి పాక్ బౌలర్లను ఇబ్బంది పెట్టిన అభిషేక్, ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. అందుకే షాహీన్ షా ఆఫ్రిది బృందం మళ్లీ అతడినే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో నిలబడితే భారత్‌కు భారీ స్కోరు దాదాపు ఖాయం.
Details
సూపర్ ఫామ్ లో ఇషాన్ కిషన్
అతనితో పాటు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా దూకుడైన ఆటగాడు. తర్వాతి వరుసలో ఆసియా కప్ ఫైనల్లో మెరిసిన తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్, హర్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌లతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. పాకిస్థాన్ ఓపెనర్లు షాహిద్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్‌లతో పాటు సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్‌పై ఆశలు పెట్టుకుంది. అదనంగా ఉస్మాన్ ఖాన్, ఫహీం అష్రఫ్ కూడా ప్రమాదకరులే.
Details
మిస్టరీ స్పిన్నర్ల సమరం
కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. భారత్‌కు మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి ఉండగా, పాక్ ఆశలు ఉస్మాన్ తారీక్‌పై నిలిచాయి. ఆసియా కప్‌లో వరుణ్ పాక్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. నెదర్లాండ్స్‌పై 2 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతనికి తోడు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బాధ్యతలు పంచుకుంటారు. పిచ్‌ను బట్టి ఒక పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్‌ను ఆడించే అవకాశం ఉంది. పేస్‌లో జస్ప్రిత్ బుమ్రాకు తోడు హార్దిక్, దూబే సహకరిస్తారు. పాక్ తరఫున తారిఖ్‌తో పాటు అబ్రార్ అహ్మద్, షాదాబ్, సయిమ్ అయూబ్‌ల స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత్ జాగ్రత్త అవసరం.
Details
కరచాలనం ఉంటుందా?
మరో స్పిన్నర్ నవాజ్‌ను పక్కన పెట్టి షహీన్, ఫహీమ్‌లకు తోడుగా సల్మాన్ మీర్జాను అదనపు పేసర్‌గా తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. టాస్ సమయంలో, మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా లేదా అన్నది కూడా చర్చనీయాంశం. పహల్గాం ఘటన తర్వాత ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థులతో చేతులు కలపలేదు. పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా టీమ్‌ఇండియా పట్టించుకోలేదు. అండర్-19 ప్రపంచకప్‌లో జూనియర్ జట్టు కూడా అదే మార్గంలో నడిచింది. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. పాక్ ఐసీసీ ప్రతినిధి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సూర్యకుమార్ స్పందిస్తూ ఇంకో 24 గంటలు ఆగండి. మేం ఇక్కడికి క్రికెట్ ఆడటానికే వచ్చాం. మిగతా విషయాలు రేపు నిర్ణయిస్తామని వ్యాఖ్యానించాడు.
Details
వర్షం ముప్పు
ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశముంది. కొలంబోలో ఆదివారం 70 శాతం వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా. మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. తుది జట్లు (అంచనా) భారత్ అభిషేక్/సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, దూబె, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా. పాకిస్థాన్ ఫర్హాన్, అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్, షాదాబ్, ఉస్మాన్, ఫహీమ్, నవాజ్/సల్మాన్ మీర్జా, షహీన్, అబ్రార్, తారిఖ్.