Loading...
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో మీరాబాయి చాను రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!
ఏషియన్ గేమ్స్ 2026లో మీరాబాయి చాను రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో మీరాబాయి చాను రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏషియన్ గేమ్స్ 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకం సాధించారు. మహిళల 49 కేజీల విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. బుధవారం జరిగిన పోటీల్లో స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు ఎత్తారు. మొత్తంగా 198 కేజీల బరువును లిఫ్ట్ చేసి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. బంగారం ఉత్తర కొరియాకే.. ఉత్తర కొరియాకు చెందిన వెయిట్‌లిఫ్టర్ రి సాంగ్ గమ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆమె స్నాచ్‌లో 94కేజీలు,క్లీన్ అండ్ జర్క్‌లో 121 కేజీలు ఎత్తారు. మొత్తంగా 215కేజీల బరువును లిఫ్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచారు. ఇండోనేషియాకు చెందిన విజయన లులుక్ డియాని ట్రి కాంస్య పతకం సాధించారు.

వివరాలు 

28 ఏళ్ల నిరీక్షణకు తెర..

ఆమె స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 103 కేజీలు ఎత్తారు. మొత్తంగా 191 కేజీల బరువుతో మూడో స్థానంలో నిలిచారు.

మీరాబాయి చాను సాధించిన ఈ రజత పతకం భారత్‌కు ప్రత్యేకమైనది.

ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆమెకు ఆసియా గేమ్స్‌లో మాత్రం ఇప్పటివరకు మెడల్ దక్కలేదు.

ఈసారి రజతంతో ఆ లోటు తీరింది. అంతేకాకుండా ఆసియా గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత పతకం లభించింది.

1998లో జరిగిన ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించారు.

ఆ తర్వాత ఈ విభాగంలో భారత్‌కు ఆసియా గేమ్స్ పతకం దక్కలేదు. తాజాగా మీరాబాయి చాను ఈ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికారు.

వివరాలు 

సాఫ్ట్ టెన్నిస్‌లోనూ పతకం..

సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా భారత్‌కు పతకం అందించారు. ఈ క్రీడలో దేశానికి తొలి పతకాన్ని సాధించిన ఆటగాడిగా నిలిచారు.

సెమీఫైనల్లో గాయపడటంతో ఆయన పోరాటాన్ని కొనసాగించలేకపోయినా.. కాంస్య పతకం దక్కింది.

షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

షూటింగ్‌లోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. అనంత్‌జీత్ సింగ్ నరుకా, మైరాజ్ ఖాన్, భవ్‌తేఘ్ సింగ్ గిల్‌లతో కూడిన పురుషుల స్కీట్ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది.

అంతకుముందు మహిళల స్కీట్ జట్టు కూడా ఇదే విభాగంలో కాంస్య పతకం సాధించింది.

ADVERTISEMENT

వివరాలు 

మను భాకర్‌కు నిరాశ..

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌కు నిరాశ ఎదురైంది.

ఫైనల్‌లో పతకం సాధించలేకపోయిన ఆమె మెడల్ లేకుండానే పోటీ నుంచి నిష్క్రమించారు.

భారత్ ఖాతాలో 11 పతకాలు..

ప్రస్తుతం ఏషియన్ గేమ్స్ 2026 పతకాల పట్టికలో భారత్ 11 పతకాలతో 11వ స్థానంలో కొనసాగుతోంది.

ఇందులో ఒక స్వర్ణం, ఐదు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.

మీరాబాయి చాను రజతంతో పాటు సాఫ్ట్ టెన్నిస్, షూటింగ్‌లో సాధించిన పతకాలతో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది.

ADVERTISEMENT