ICC Mens T20 World Cup: నజ్రుల్‌పై నిప్పులు చెరిగిన బంగ్లా కోచ్.. మాట మార్చారని విమర్శ
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ వివాదం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్.. మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నజ్రుల్‌ను అబద్ధాలు చెప్పే వ్యక్తి అంటూ బహిరంగంగా విమర్శించారు. మొదటగా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించకపోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని నజ్రుల్ ప్రకటించారు. అయితే అనంతరం తన మాట మార్చి, అది ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఈయూ-టర్న్‌పైనే సలావుద్దీన్ తీవ్రంగా స్పందించారు. నేను స్వయంగా ఒక ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయులు సాధారణంగా అబద్ధాలు చెప్పరు. నజ్రుల్ కూడా బోధనా రంగానికే చెందిన వ్యక్తి. ఆయన ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.
Details
మాట మార్చడం సరైంది కాదు
నా దేశంలోని అత్యున్నత విద్యాసంస్థకు చెందిన వ్యక్తి ఇలా అబద్ధాలు మాట్లాడతాడని ఊహించలేదు. ఇది మేం అంగీకరించలేం. మొదట ఒకటి చెప్పి, తర్వాత పూర్తిగా మాట మార్చడం సరైంది కాదని సలావుద్దీన్ అన్నారు. ఈ నిర్ణయాల ప్రభావం ఆటగాళ్లపై తీవ్రంగా పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యువ క్రికెటర్ ప్రపంచకప్‌లో ఆడాలని కలలు కంటాడు. కానీ ఆ కలను ఒక్క క్షణంలో ధ్వంసం చేశారు. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు అయిదు రోజుల పాటు మానసికంగా తీవ్రంగా ఇబ్బందిపడ్డారని తెలిపారు. ఇదిలా ఉండగా బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేసిన తరువాత భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
Details
వారి స్థానంలో స్కాట్లాండ్ ఎంపిక
బంగ్లా ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే భద్రతా కారణాలను చూపిస్తూ తమ క్రికెటర్లను భారత్‌కు పంపడానికి అంగీకరించలేదు. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీపై బంగ్లాదేశ్ ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే భారత్‌లో భద్రతా ప్రమాణాలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేస్తూ ఐసీసీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో పాల్గొనలేదు. వారి స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.