BCCI: 200 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడిస్తాం.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
గాయం నుంచి కోలుకున్నారని ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయడం.. తీరా ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకముందే మళ్లీ గాయం తిరగబెట్టడంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లడం ఇటీవల తరచూ జరుగుతోంది. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE)పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు మంగళవారం భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ జట్టులో నితీశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు చోటు దక్కింది. అయితే వీరి ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కఠినమైన నిబంధన విధించినట్లు తెలుస్తోంది.
వివరాలు
కఠినంగా నిర్ణయాలు..
ఆటగాళ్లు కేవలం 100 శాతం ఫిట్‌గా ఉంటే సరిపోదని.. 200 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
''ఆటగాళ్ల గాయాల విషయంలో బీసీసీఐ ఇకపై కఠినంగా వ్యవహరించనుంది.
సదరు ఆటగాడు 200 శాతం ఫిట్‌గా ఉన్నాడని భావించిన తర్వాతే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి విడుదల చేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం'' అని బోర్డు వర్గాలు తెలిపినట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు ఈ నలుగురినీ ఎంపిక చేసినప్పటికీ.. మ్యాచ్‌లు ఆడాలంటే 200 శాతం ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని షరతు విధించడం ఆసక్తికరంగా మారింది.
అఫ్గానిస్థాన్‌తో సిరీస్ అనంతరం భారత్ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.
వివరాలు
కివీస్ 'A'తో భారత్ 'A' సిరీస్
అక్టోబర్‌లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
అంతకంటే ముందు భారత్ 'A' జట్టు.. న్యూజిలాండ్ 'A'తో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది.
ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఈ మ్యాచ్‌లను సన్నాహకంగా ఉపయోగించుకోనున్నట్లు న్యూజిలాండ్ బోర్డు వెల్లడించింది.
అక్టోబర్ 22 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో భారత జట్టు షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండనుంది.