రిషబ్ పంత్ కోసం ప్రత్యేక విమానం.. ముంబైకి తరలింపు
రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తుండుగా.. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. గాయపడిన రిషబ్ పంత్‌ను డెర్హాడూన్ నుంచి విమానంలో తరలించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఇటీవల కారు ప్రమాదం నుంచి బయటపడిన పంత్ ఆరోగ్య పరిస్థితిపై బుధవారం బోర్డు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జే షా ఈ విషయాన్ని వెల్లడించారు.
పంత్ పూర్తి బాధ్యత బీసీసీఐదే
పంత్ కుడి మోకాలికి చికిత్స అవసరం. దీని చికిత్స కోసం ముంబైకి తరలించడానికి ఎయిర్ అంబులెన్స్‌ను పంపాలని షా బోర్డు అధికారులను కోరారు. ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకొవడానికి ఆరు నెలలు సమయం పట్టే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. బీసీసీఐ వైద్య బృందం పంత్ నుదురు భాగంలో, కుడి చేతి మణికట్టు వద్ద, వీపు భాగంలో, చీలమండకూ గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, షా ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముంబైలో పంత్ కి చేసే చికిత్స బాధ్యతలను పూర్తిగా బీసీసీఐ తీసుకుంది. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా ప్లేయర్లు, టీమిండియా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు